- మెట్పల్లి 30 పడకల ఆస్పత్రి నిర్వహణపై దృష్టి పెట్టండి
- కోరుట్ల ఎమ్మెల్యేకు జగిత్యాల ఎమ్మెల్యే కౌంటర్
జగిత్యాల రూరల్, వెలుగు: కోరుట్ల పేషెంట్లు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారని.. మెట్‌పల్లిలోని 30 పడకల ఆస్పత్రి నిర్వహణపై దృష్టి పెట్టి, 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హితవు పలికారు. ఇటీవల జగిత్యాల మెడికల్ కాలేజీ సందర్శన సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ఇచ్చారు.
శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. మీతో కాకపోతే తన దగ్గరికి వస్తే సీఎం రేవంత్ రెడ్డితోపాటు జిల్లా మంత్రిని కలిపించి నిధులు ఇప్పిస్తానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్హయాంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను రూ.119 కోట్లతో ప్రారంభించగా.. నిధుల లేమితో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెండింగ్ పనుల కోసం రూ.40 కోట్లు మంజూరై, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 230 పడకల హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, జ్యోతి, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
