ఎప్పుడూ వివాదాస్పద , విభిన్నమైన అభిప్రాయాలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లేటెస్ట్ గా ఆయన మరో సారి సంచలన వ్యాఖ్యలతో తెరపైకి వచ్చారు. ఈసారి సినిమా పైరసీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు, నెటిజన్లలో పెను దుమారం రేపుతున్నాయి. సాంకేతికత , పోలీసుల బలహీనత కంటే, పైరసీకి గల ఏకైక కారణం. చూసేవారు ఎక్కువ మంది ఉండటం అన్నారు.. ఈ కారణంగానే 'రాబిన్ హుడ్ రవి' లాంటి పైరసీ సర్వర్లకు డిమాండ్ పెరుగుతోందని వర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
రాబిన్ హుడ్ హీరో కాదు, 'టెర్రరిస్ట్'..
'రాబిన్ హుడ్' తో పైరసీని పోల్చేవారికి వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాబిన్ హుడ్ ఏ మాత్రం హీరో కాదన్నారు. "ప్రపంచంలో మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది" అని అభివర్ణించారు. సంపన్నులు ధనవంతులుగా ఉండటం మాత్రమే చేసిన నేరం. దానికే వారిని దోచుకోవడం, చంపడం సమంజసమా? ఆర్థికంగా విజయం సాధించడమనేది దొంగతనం, హత్యలకు దారితీసే శిక్షాస్మృతి అనుకోవడం ఎంత అజ్ఞానం? అని ప్రశ్నించారు. కేవలం దొంగిలించబడిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారనే కారణంతో ఒక నేరస్తుడిని 'సెయింట్'గా కీర్తించడం అజ్ఞానమేనని వర్మ తేల్చి చెప్పారు.
సినిమా చూడటం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి పైరసీని సమర్థిస్తున్న వారు, ఖరీదైనవి అనే కారణంతో BMW షోరూమ్‌లను దోచుకుని, ఆ కార్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని కూడా వాదించాలని వ్యంగ్యంగా అన్నారు. ఇటువంటి ఆలోచన సామాజిక పతనానికి దారితీస్తుంది, అరాచకానికి దారి తీస్తుంది అని ఆర్జీవీ హెచ్చరించారు.
పైరసీ చూసే వీక్షకులను జైల్లో పెట్టాలి..
ప్రజలు పైరసీని చూడటం వెనుక సౌలభ్యం ప్రధాన కారణమని ఆర్జీవీ తెలిపారు. కొంతమందికి డబ్బు ఆదా చేయడమైతే, ఇంకొందరికి థియేటర్‌కు వెళ్లే సమయాన్ని ఆదా చేసుకోవడానికి లింక్‌ను క్లిక్ చేయడం సులభం. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు సైతం ఈ కారణం చేతనే పైరసీ కంటెంట్ చూస్తున్నారని ఆయన ఒప్పుకున్నారు. పైరసీని పూర్తిగా ఆపడానికి వర్మ ఒకే ఒక్క పరిష్కారం సూచించారు. వ్యూయర్లను నేరస్తులుగా పరిగణించాలని చెప్పుకొచ్చారు..
"పైరసీ చేసేవారిని పట్టుకోవడం కష్టమైతే, చూసే వారిని పట్టుకోవడం తేలిక. పైరసీ కంటెంట్ చూస్తున్న 100 మందిని అరెస్టు చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటించండి. సినిమా లింక్ చూడటం, ఫార్వార్డ్ చేయడం అనేది దొంగిలించబడిన వస్తువులను స్మగ్లింగ్ చేయడంగా, స్వీకరించడంగా ప్రజలు భావిస్తారు. భయం పని చేస్తుంది. నైతికత కాదు అని వర్మ చెప్పారు.
స్టార్ ఫీజులు- మార్కెట్ డైనమిక్స్
అంతేకాదు, సినిమా తారల భారీ పారితోషికాల గురించి వర్మ మరో పోస్ట్‌తో వివరణ ఇచ్చారు. స్టార్ ఫీజు అనేది కేవలం 'మార్కెట్ డైనమిక్స్' మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఒక హీరో కారణంగా థియేటర్‌కు ఎంతమంది వస్తారు అనే నిర్మాత అంచనా వేసిన ఆదాయం ఆధారంగానే పారితోషికం నిర్ణయించబడుతుంది. సినిమా నిర్మాణ ఖర్చును తీసివేస్తే, మిగిలిన అధిక లాభంలో పెద్ద భాగాన్ని ఆ స్టార్‌కే ఇస్తారు, ఎందుకంటే టికెట్లను అమ్ముడుపోయేలా చేసింది ఆయనే కాబట్టి. ఎక్కువ తీసుకునే వ్యక్తికి కాక, ఇచ్చేవాడికే విలువ తెలియాలి. ఇక్కడ స్టార్‌కు ఎక్కువ ఇచ్చి నష్టపోయేది నిర్మాత మాత్రమే, బయట ఏడ్చేవారు కాదు అని ఆర్జీవీ తమ పోస్ట్‌ను ముగించారు.
