రైతు నిరసనల్లో దేశ వ్యతిరేకుల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు

రైతు నిరసనల్లో దేశ వ్యతిరేకుల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో జాతి వ్యతిరేక శక్తులు, లెఫ్టిస్టులు, మావోయిస్టు వింగ్ చొరబడ్డాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. దేశ వ్యతిరేక ప్రసంగాలు చేసిన వారి ఫొటోలను రైతుల నిరసనల్లో ప్రదర్శిస్తున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు.

‘నాగ్‌‌పూర్‌‌కు దగ్గరలో గడ్చిరోలి జిల్లా ఉంది. ఇది నక్సలైట్ ప్రభావితం ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. అతడికి రైతుల నిరసనలతో నేరుగా ఎలాంటి సంబంధమూ లేదు. కానీ రైతు నిరసనల్లో ఆ వ్యక్తి ఫొటోను ప్రదర్శిస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. ఢిల్లీలో దేశ వ్యతిరేక స్పీచ్‌‌లు ఇచ్చిన వారితోపాటు ఈ దేశంతో, రైతుల నిరసనలతో ఎలాంటి సంబంధం లేని వారి ఫొటోలను కూడా ప్రదర్శిస్తున్నారు. దయచేసి ఈ నిరసనల్లో వారి ఫొటోలు ఎలా వచ్చాయో చెప్పండి. ఈ నిరసనలను వాడుకొని, అన్నదాతలను తప్పుదోవ పట్టించే కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పుగా నేను భావిస్తున్నా’ అని గడ్కరీ పేర్కొన్నారు.