ముషీరాబాద్, వెలుగు: మానవ మేథస్సుతో ఏదైనా సాధించవచ్చని.. ఏకాగ్రత, ధ్యానంతో అపారమైన స్మరణశక్తిని పొందవచ్చని జైన్ మహా అవధానులు పేర్కొన్నారు. మహా శతావధానం కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, అది మానవ మేథస్సుపై ఉన్న నమ్మకాన్ని బలపరిచే ఒక మహాయజ్ఞమని తెలిపారు. జైన్ ఇంటర్నేషనల్ విద్యాపీఠ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో మహా శతావధానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జైన్ మహా అవధాని అభినందన చంద్రసాగర్, ఆయన శిష్యులు నమీచందర్ సాగర్, నేమీచంద్రసాగర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఆశిష్ జైన్, ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ సీరియల్ నటులు సమయ్ షా (గోగి), గోలి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అవధాన విద్యకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కంప్యూటర్ల కంటే వేగంగా మానవ మెదడు పనిచేయగలదని పేర్కొన్నారు. అవధానం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా విద్యార్థులు కూడా ఇటువంటి ఏకాగ్రతను అలవరచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైలాష్ బండారి, విక్రమ్, అమిత్, ఆకాష్ గురూజీ తదితరులు పాల్గొన్నారు.
