న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభ ప్రొరోగ్ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతుండటంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు. తెరవెనక డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడి పది రోజులు గడుస్తున్నా.. ప్రొరోగ్‌కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాకపోవడం వెనుక దుర్భుద్ధితో కూడిన వ్యూహాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన ఆరోపించారు.
సాధారణంగా సభ నిరవధిక వాయిదా పడిన 2 నుంచి 4 రోజుల్లోనే ప్రొరోగ్ జరుగుతుందని, కొన్నిసార్లు అదే రోజు కూడా ఉత్తర్వులు వచ్చిన దాఖలాలు ఉన్నాయని జైరాం రమేశ్ గుర్తుచేశారు. గతంలో 2015 వర్షాకాల సమావేశాల సమయంలో 28 రోజులు, 2021లో 20 రోజుల సమయం పట్టినప్పటికీ, అప్పట్లో ఎలాంటి కుట్రపూరిత ఆలోచనలు లేవని కేంద్రం సమర్థించుకుందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆలస్యానికి గల అసలు కారణాలను దేశ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
