భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది : జైరాం రమేష్ 

భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది : జైరాం రమేష్ 

సంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన వస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తైందని తెలిపారు. ఉన్నతమైన లక్ష్యం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారని చెప్పారు. ఈ యాత్ర ఎన్నికల కోసం మాత్రం కాదన్నారు. రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ పాదయాత్ర ద్వారా తమకు తెలిసిందన్నారు. అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు భారత్ జోడో యాత్రకు ఎలాంటి సంబంధం లేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని, ఇది అత్యంత కఠిన నిర్ణయమని చెప్పారు. పరిపాలన విషయంలో కేంద్రం లో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు ఎలాంటి తేడా లేదని జైరాం రమేష్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పట్టాలపై వెళ్లే డబుల్ ఇంజన్ ప్రభుత్వాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్  నాయకులు ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించారో అందరికీ తెలుసన్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గమనించాలన్నారు. అన్ని పార్టీల కంటే MIM బీజేపీతో ఎక్కువ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతోందన్నారు. ‘దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ, ఫ్రీడమ్ ఆఫ్టర్ స్పీచ్ లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.