
న్యూఢిల్లీ: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ , జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ కదలికలను దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ఏరియాలో కనిపించినట్లు వెల్లడించాయి. ఈ ప్రాంతం అతని టెర్రర్ కార్యకలాపాలకు అడ్డా అయిన బహవల్పూర్ నుంచి 1,000 కి.మీ. దూరంలో ఉంది.
అజార్ ఇటీవల స్కార్డు, సద్పారా రోడ్ ఏరియాలో ఎక్కువగా కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇది పర్యాటక కేంద్రంగా, సరస్సులు, ప్రకృతి ఉద్యానవనాలతో ప్రసిద్ధి చెందిందని వివరించాయి. అంతేగాక, రెండు మసీదులు, వాటికి అనుబంధంగా మదర్సాలు, గెస్ట్‌హౌస్‌లు ఉన్నట్లు వెల్లడించాయి. ఇవి అజార్ తలదాచుకునేందుకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మసూద్ అజార్ పాకిస్తాన్ లో లేడని, ఒకవేళ ఉన్నట్లు భారత్ కచ్చితమైన సాక్ష్యాలు సమర్పిస్తే అతణ్ని అరెస్టు చేసి అప్పగిస్తామని పేర్కొన్నారు. మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని..అఫ్గానిస్తాన్ లో ఉన్నాడేమోనని పేర్కొన్నాడు.
ఇప్పుడు మసూద్ అజార్ కదలికలు పీవోకేలో కనిపించడంతో బిలావల్ భుట్టో జర్దారీ వ్యాఖ్యలు తప్పని తేలింది. జైషే సంస్థ సోషల్ మీడియా ఖాతాలు కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదోవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి.
అయినా మన నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి. భారత్ లో పలు ఉగ్రదాడుల వెనుక మసూద్ హస్తం ఉంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్, 2019 పుల్వామా దాడులకు మసూద్ అజార్ కుట్రదారుడని భారత్ ఆరోపిస్తున్నది.