జైట్లీ, సుష్మా స్వరాజ్​ మిస్

జైట్లీ, సుష్మా స్వరాజ్​ మిస్

న్యూఢిల్లీమోడీ ఫస్ట్​ టెర్మ్​ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ సీనియర్లు అరుణ్​ జైట్లీ, సుష్మాస్వరాజ్​ ఈసారి దూరంగా ఉండిపోయారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన జైట్లీ, విదేశాంగ మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన సుష్మ ఇద్దరికీ మోడీకి సన్నిహితులుగా పేరుంది. కానీ సుష్మ ​ఈసారి ఎలక్షన్లలో పోటీకే దూరంగా ఉండగా.. జైట్లీ ఆనారోగ్యం వల్ల తాను ప్రభుత్వంలో చేరలేనని చెప్పారు.

తొలి నుంచీ జైట్లీ సపోర్ట్​

మోడీ గుజరాత్​ సీఎంగా ఉన్నప్పటి నుంచీ జైట్లీ ఆయనకు మద్దతుగా నిలిచారు. మోడీని బీజేపీ పీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడానికి కారణమైన వారిలో జైట్లీ కీలకమని చెబుతారు. మోడీ ప్రభుత్వంలోని జన్ ధన్​ యోజన, డిమానిటైజేషన్, జీఎస్టీ, బినామీ ప్రాపర్టీస్​ చట్టం వంటి చాలా అంశాల్లో మోడీ వెనుక జైట్లీ నిలిచారు. మోడీ సర్కారులో ఆర్థిక మంత్రి అయిన జైట్లీ నంబర్​2గా వ్యవహరించారన్న అభిప్రాయముంది. కానీ ఈసారి ఆయన కేంద్ర మంత్రి పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

మోడీ ఖ్యాతి

మోడీ సర్కారు ప్రతిష్టను పెంచడంలో కీలకంగా వ్యవహరించిన నేత సుష్మా స్వరాజ్. బీజేపీ అగ్రనేత అద్వానీ అనుచరుల్లో ఆమె ఒకరు. మోడీ సర్కారులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. వివిధ దేశాలతో భారత్​ సంబంధాలు మెరుగుపడేలా కృషి చేశారు. గత ఐదేళ్లలో మోడీ ఏకంగా 90 దేశాల్లో పర్యటించి, ఆయా దేశాధినేతలతో చర్చలు జరపడంలో, ఐక్యరాజ్యసమితి వ్యవహారాల్లో చురుగ్గా పనిచేశారు. ఆమె చర్యలతోనే గల్ఫ్​ సహా పలు ముస్లిం దేశాలతో భారత్​ సంబంధాలు మెరుగుపడ్డాయి.

మరికొందరూ దూరం..

సురేశ్​ ప్రభు, ఉమా భారతి, రాధామోహన్​సింగ్, రాజ్యవర్ధన్​సింగ్​ రాథోడ్, మేనకాగాంధీ, జయంత్​ సిన్హా, మహేశ్​ శర్మకు చాన్స్​ రాలేదు. జేపీ నడ్డాకు మంత్రి పదవి ఇవ్వకున్నా, పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.