మా బ్యాంకును తరలిస్తే ఊరుకోం..ఎస్‌‌బీఐ శాఖ తరలింపుపై సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ప్రజల నిరసన 

మా బ్యాంకును తరలిస్తే ఊరుకోం..ఎస్‌‌బీఐ శాఖ తరలింపుపై సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ప్రజల నిరసన 

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో 1988 నుంచి(దాదాపు నాలుగు దశాబ్దాలు)గా సేవనందిస్తున్న ఎస్‌‌బీఐ అగ్రికల్చర్‌‌ కమర్షియల్‌‌ శాఖను వేరే ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదనపై గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జాజిరెడ్డిగూడెంలోని వందలాది మంది మహిళలు, రైతులు, వృద్ధులు, పొదుపు సంఘాల సభ్యులు బ్యాంకు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పార్టీలకతీతంగా అంతా ఒక్కటై 'మా బ్యాంకు మాకే కావాలి' అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

సుమారు 3 వేల మంది రైతుల ఖాతాలు, 180 పొదుపు సంఘాలతో కలిపి మొత్తం 5 వేలకు పైగా ఖాతాలున్న ఈ శాఖను తరలిస్తే గ్రామీణులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకును తరలించడం సరికాదని.. పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు తాము ఏడాది క్రితమే స్థలం ఇస్తామన్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. బ్యాంకు తరలింపు నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకోవాలని, లేదంటే ఖాతాలన్నీ రద్దు చేసుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌‌బీఐ రీజినల్‌‌ మేనేజర్‌‌ స్వయంగా గ్రామానికి వచ్చి బ్యాంకు ఇక్కడే కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 38 ఏళ్ల బంధం ఉన్న తమ బ్యాంకును దూరం చేసుకునే ప్రసక్తే లేదని జాజిరెడ్డిగూడెం ప్రజలు తేల్చిచెప్పారు.