మునుగోడులో బీసీలకు అన్యాయం జరిగింది

మునుగోడులో బీసీలకు అన్యాయం జరిగింది

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రధాన పార్టీలన్నీ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చి... బీసీలకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు 67 శాతం ఉన్నారని, కానీ పార్టీలన్నీ వాళ్లను కేవలం ఓటర్లుగానే గుర్తించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చి... మునుగోడును కాస్త రెడ్డిగోడుగా మార్చాయని విమర్శించారు. మునుగోడులో రాజకీయ పార్టీలు కుల సంఘాలుగా మారిపోయాయని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొత్తం సభ్యత్వాల్లో 70 లక్షల మంది వరకు బీసీలే ఉన్నారన్నారు. జాతీయ పార్టీ స్థాపించిన కేసీఆర్.. మొదటి టికెట్టే రెడ్డిలకు ఇచ్చారని, ఇలా అయితే ఆయన కొత్త పార్టీతో సామాజిక న్యాయం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ రెడ్డికే టికెట్ కేటాయించిందని చెప్పారు. మునుగోడు ఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీకి  కూడా బీసీలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, త్వరలోనే అక్కడ బీసీ సమ్మేళనం నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.