- 2019 కంటే ఇప్పుడేబీసీలకు తక్కువ సీట్లు: జాజుల
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారులో శాస్ర్తీయత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఖరారు చేశారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారులు చేసిన తప్పుల వల్ల బీసీలకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ నష్టం జరుగుతోందని సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లకే రాష్ట్ర ప్రభుత్వం గండికోడుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18 శాతం నుంచి 22 శాతం వరకు బీసీ రిజర్వేషన్లు అమలైతే, ప్రస్తుతం 16 శాతం నుంచి 20 శాతం వరకే రిజర్వేషన్లు కేటాయించారని జాజుల ఆరోపించారు. అనేక డివిజ న్లలో, మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదని విమర్శించారు. మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికల్లో కంటే కనీసం రెండు మూడు గ్రామాల బీసీ కోటను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచారన్నారు. దీనిని బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టారని, ఇది కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, వారు న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మ దహనం, 30న చలో హైదరాబాద్, వచ్చే నెల 8న చలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజుల హెచ్చరించారు.
