60 మంది బీసీలను అసెంబ్లీకి పంపే వరకూ పోరాటం ఆగదు : జాజుల శ్రీనివాస్‌గౌడ్

60 మంది బీసీలను అసెంబ్లీకి పంపే వరకూ పోరాటం ఆగదు : జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : పార్టీలకు, జెండాలకు అతీతంగా సరూర్ నగర్ లో బీసీ సింహ గర్జన సభను ఏర్పాటు చేశామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్. బీసీల పోరాటాన్ని ఈ వేదిక నుండే ప్రారంభిస్తున్నామన్నారు. బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలోనే బస్సుయాత్ర కూడా మొదలు పెడుతున్నామని చెప్పారు. బస్సుయాత్ర ముగింపు సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తామన్నారు. వర్షం కారణంగా బీసీ సింహ గర్జన సభ ఆలస్యమైందన్నారు. చాలా మంది బీసీ బిడ్డలు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రకృతి సహకరించకున్నా.. ఇంత మంది బీసీలు సభకు వచ్చి.. బీసీల ఐక్యత చాటారని చెప్పారు. 

60 మంది బీసీలను అసెంబ్లీకి పంపే వరకు తమ పోరాటం ఆగదన్నారు  జాజుల శ్రీనివాస్‌గౌడ్. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, కులానికి ఒక సీటు... బీసీలకు ఓటు నినాదంతో ముందుకెళ్తామన్నారు. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని అనుకున్నామన్నారు. 60 మంది బీసీలు ఉండాల్సిన అసెంబ్లీలో కేవలం 23 మందే ఎమ్మెల్యేలుగా ఉన్నారని చెప్పారు. 

బీసీలకు ముఖ్యమంత్రి పదవి రావాలన్నారు జాజుల శ్రీనివాస్‌గౌడ్. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 60 అసెంబ్లీ సీట్లు ఇవ్వకుంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షం హోదాలో కూడా ఉండవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం రాకుంటే బీసీల పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో కేవలం 23 మంది మాత్రమే బీసీలు ఉన్నారని అన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలకు ఎక్కవ శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

బీసీ సింహ గర్జన సభకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బీసీ నేత చిన్న శ్రీశైలం యాదవ్, తెలంగాణ ఉద్యమ కారుడు విఠల్, ఇతర బీసీ నేతలు, వివిధ జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. 

పోరాటం ఆగదు : విశారదన్ మహారాజ్ 

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలన్నారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. ఒక్కశాతం లేని వారు రాజ్యాన్ని పాలిస్తున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం వచ్చే వరకు కలిసి పోరాడుతామన్నారు. మూడు పార్టీలను వేదిక నుండి హెచ్చరిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో బీసీ బహుజనుల సత్తా చూపిస్తామన్నారు. బీసీలకు బహుజనుల రాజ్యాధికారం వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రేపటి నుండే తమ పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు.