
- నాన్చివేత ధోరణి మీకే నష్టం
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపుపై గురువారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఇలాంటి కీలక అంశంపై నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తే అధికార పార్టీకి, ప్రభుత్వానికి నష్టమని హెచ్చరించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇందులో భాగంగా ఆల్ పార్టీ నేతలతో సీఎం ఢిల్లీ వెళ్లి ప్రధానని కలవాలన్నారు. అఖిలపక్ష నేతలతో ఢిల్లీ వెళ్లే తేదీని సీఎం ప్రకటించాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల టైమ్ దగ్గర పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జీవోలు, ఇతర ప్రత్యామ్నాయాల పేరిట కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పార్టీ మీటింగ్లో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.