
హైదరాబాద్, వెలుగు: ఉప రాష్ట్రపతి బీసీలకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. బీసీ వర్గానికి చెందిన మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ లేదా తమిళిసైకి ఇవ్వాలన్నారు. గురువారం ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి జాజుల లేఖ రాశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముగ్గురు గవర్నర్లకు అవకాశం కల్పిస్తే అందులో అందరూ అగ్రకులాలకు చెందినవారే ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవులు, కీలకమైన పదవుల్లోనూ అగ్రకులాలకే అవకాశం దక్కుతోందన్నారు.
ఉప రాష్ట్రపతి పదవి బీసీ వర్గానికి ఇచ్చి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని బీజేపీ నిరూపించుకోవాలన్నారు. గతంలో రాష్ట్రపతులుగా, ఉప రాష్ట్రపతులుగా బీసీలకు అవకాశం రాలేదని, మొదటిసారి ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌కు అవకాశం వస్తే.. ఆయనను పూర్తికాలం పదవిలో ఉండకముందే రాజీనామా చేయించారని జాజుల ఆరోపించారు. సామాజిక న్యాయం కోణంలో బీసీలకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.