పాకాల జాలు బంధం కాలువ మళ్లీ కబ్జా.!

పాకాల జాలు బంధం కాలువ మళ్లీ కబ్జా.!

వరంగల్​/ నర్సంపేట, వెలుగు : వరంగల్​జిల్లా నర్సంపేట టౌన్​మీదుగా వెళ్లే పాకాల జాలుబంధం కాలువ మళ్లీ కబ్జాకు గురైంది. 33 ఫీట్ల కాలువను క్లోజ్​చేసి ఓ కబ్జాదారు ప్లాట్లుగా మలిచి దర్జాగా విక్రయిస్తున్నాడు. ఈతతంగం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్లు ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్​ఉమ్మడి జిల్లాలోనే పాకాల చెరువు అతిపెద్ద చెరువు. ఈ చెరువు కింద దాదాపు 30 వేల ఎకరాలు  ఆయకట్టు సాగువుతోంది. చెరువుకు ఐదు ప్రధాన ఉప కాలువలు ఉన్నాయి.

ఇందులో జాలు బంధం కాలువ 2.14 ఎకరాలను బీఆర్​ఎస్​కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కొన్నేండ్ల నుంచి దర్జాగా కబ్జా చేస్తున్నాడు. ఐబీ పరిధిలోని కాలువ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించి కోట్లు గడించాడు. తాజాగా సర్వాపురం బైపాస్​ టూ మహబూబాబాద్​ రోడ్​కు సమీపంలో జాలు బంధం కాలువను కబ్జా చేసి కాగితాలపై ప్లాట్లు చేసి ఇతరులకు విక్రయించారు. ఈ కబ్జా భూబాగోతాలను ఆఫీసర్లు వెలికి తీస్తే కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు బయటపడే ఛాన్స్​ఉంది. కాగా, జాలు బంధం కాలువ కబ్జాలపై వార్తలను రాసిన విలేఖరులను సైతం బెదిరించిన సంఘటనలు ఉన్నాయి.  

ఆఫీసర్ల ఉదాసీన వైఖరి..

జాలు బంధం కాలువను కాపాడుతామని చెబుతూనే ఇరిగేషన్​ఆఫీసర్లు ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కబ్జాను అడ్డుకుని కాలువను పరిరక్షించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇరిగేషన్​ ఆఫీసర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మొక్కుబడిగా ఆఫీసర్లు ఫీల్డ్​ విజిట్​చేసి సర్వేయర్​ రాలేదని దాటవేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు.

ఈక్రమంలో కబ్జాదారు రంగ ప్రవేశం చేసి జాలు బంధం కాలువను మార్కెట్​లో గజానికి రూ.5 వేల చొప్పున విక్రయించడంతో ఎమ్మెల్యే ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ విషయమై ఈఈ సుదర్శన్​ను వివరణ కోరగా, జాలు బంధం కాలువ భూములను కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం అవుతోందన్నారు. !