స్పేస్ లోకి దూసుకెళ్లిన నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోపు

స్పేస్ లోకి దూసుకెళ్లిన నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోపు
  • ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగం  
  • భూమికి 16 లక్షల కిలోమీటర్లు వెళ్లి.. విశ్వంపై నిఘా
  • నక్షత్రాలు, గెలాక్సీలు, జీవం పుట్టుకను తెలియజేసే చాన్స్

కౌరూ (ఫ్రెంచ్ గయానా): విశ్వం పుట్టుక, నక్షత్రాలు, గెలాక్సీల గుట్టును ఛేదించే ‘టైమ్ మిషన్’ నింగికి చేరింది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ టెలిస్కోపును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎట్టకేలకు విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. స్పేస్​లో సుమారు నెలరోజులు ప్రయాణించి ఇది 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజ్(ఎల్2) పాయింట్​కు చేరుకోనుంది. వందల కోట్ల ఏండ్ల నాటి కాంతిని ఇప్పుడు టెలిస్కోపులు చూపిస్తాయి కాబట్టే.. వాటిని టైమ్ మిషన్​లుగా భావిస్తుంటారు. జేమ్స్ వెబ్ టెలిస్కోపు కూడా ఒక టైమ్ మిషన్​లా విశ్వంలో వెనక్కి చూస్తూ.. వందల కోట్ల ఏండ్ల కింద పుట్టిన కాంతిని గుర్తించి, దానిని విశ్లేషించడం ద్వారా ఇది విశ్వం గుట్టును విప్పనుంది. సుమారు 1370 కోట్ల ఏండ్ల కిందట బిగ్ బ్యాంగ్ జరిగి విశ్వం ఎలా పుట్టింది? నక్షత్రాలు, గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి? జీవం పుట్టుకకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అన్న కీలక ప్రశ్నలకు జేమ్స్ వెబ్ టెలిస్కోపు సమాధానాలు కనుక్కోనుంది. 

నెల రోజులు.. 16 లక్షల కిలోమీటర్లు 

జేమ్స్ వెబ్ టెలిస్కోపు చంద్రుడు, భూమికి ఉన్న దూరం కంటే నాలుగు రెట్లు ఎక్కువ దూరంలోని లాంగ్ రేంజ్ పాయింట్ వద్దకు ప్రయాణిస్తుంది. నెలరోజుల్లో అక్కడికి చేరుకుంటుంది. ఆ తర్వాత టెలిస్కోపులోని అన్ని ఇన్ స్ట్రుమెంట్లను యాక్టివేట్ చేసి, పని మొదలుపెట్టడానికి మరో 5 నెలలు పట్టనుంది. మొదటగా టెలిస్కోపులోని భారీ మిర్రర్, సన్ షీల్డ్​ను ఓపెన్ చేస్తారు. స్పేస్ లోని లాంగ్ రేంజ్ పాయింట్​లో ఒక్కోసారి అత్యంత వేడి, ఒక్కోసారి అత్యంత చలి వాతావరణం ఉంటుంది. ఈ రెండు వాతావరణాలను తట్టుకునేలా దీనిలో ఏర్పాట్లు చేశారు.

పనిచేయకుంటే షేక్ చేస్తరు..

మొత్తంగా టెలిస్కోపులోని అన్ని ఇన్​స్ట్రుమెంట్లను ఓపెన్ చేసేందుకు వందలాది కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయినా టెలిస్కోపులో ఏవైనా ఇన్ స్ట్రుమెంట్లు పనిచేయకపోతే.. ఎలక్ట్రికల్ వస్తువులను ఊపి చూసినట్లుగా.. దీనిని వైబ్రేషన్స్ తో ఊగిపోయేలా కూడా ఏర్పాటుచేశారు. భూమికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి.. అన్ని రకాలుగా దీనిని రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఫ్యూయల్ అయిపోతే వేరే స్పేస్ క్రాఫ్ట్​ను పంపి, ఫ్యూయల్ నింపేందుకు వీలుగా ట్యాంకును టెలిస్కోపు బయటి వైపు ఏర్పాటు చేశారు. 

10 కోట్ల ఏండ్ల విశ్వాన్ని చూపిస్తది..  

ఇప్పటికే విశ్వంలోని అనేక సీక్రెట్లను బయటపెట్టిన హబుల్ స్పేస్ టెలిస్కోపుకు సక్సెస్సర్ గా మరింత పవర్ ఫుల్ ఇన్ స్ట్రుమెంట్లతో జేమ్స్ వెబ్ టెలిస్కోపును నాసా తయారు చేసింది. హబుల్ టెలిస్కోపుతో సుమారు 1340 కోట్ల ఏండ్ల నాటి వరకు మాత్రమే విశ్వంలోని కాంతిని చూడగలిగారు. దీనికన్నా మరింత పవర్ ఫుల్ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లు ఉన్న జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో 1370 కోట్ల ఏండ్ల నాటికి కూడా వెనక్కి చూస్తూ.. విశ్వం పుట్టినప్పటి కాంతిని గుర్తించొచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా బిగ్ బ్యాంగ్ జరిగిన 10 కోట్ల ఏండ్లకు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయని సైంటిస్టుల అంచనా. సరిగ్గా ఈ కాలం నాటి కాంతిని గుర్తించేందుకే నాసా ఈ టెలిస్కోపుకు శ్రీకారం చుట్టింది.

25 ఏండ్లు.. వేలాది సైంటిస్టుల శ్రమ..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలతో సహా 29 దేశాలకు చెందిన వేలాది మంది సైంటిస్టులు దీని తయారీలో పాల్గొన్నారు. ప్రాజెక్టు 1990లలోనే ప్రారంభమైనా.. తయారీ పూర్తయి, నింగికి చేర్చేందుకు దాదాపు 25 ఏండ్లు పట్టింది.

జేమ్స్ వెబ్ స్పెషాలిటీస్ ఇవే..

మొత్తం బరువు: 7 టన్నులు

సైజు: 21 X 14 మీటర్లు (టెన్నిస్ కోర్టు అంత) 

మిర్రర్: 6.5 మీటర్ల గోల్డ్ ప్లేటెడ్ మిర్రర్ 

లైఫ్ స్పాన్: 10 ఏండ్లు 

సన్ షీల్డ్: ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లను హీట్ నుంచి కాపాడేందుకు 5 లేయర్లతో ఏర్పాటు

తయారీ ఖర్చు: 10 బిలియన్ డాలర్లు

ప్రధాన ఇన్​స్ట్రుమెంట్లు: నియర్ ఇన్​ఫ్రారెడ్ కెమెరా, నియర్ ఇన్​ఫ్రారెడ్ స్పెక్టోగ్రాఫ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్, నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్లిట్ లెస్ స్పెక్టోగ్రాఫ్.