
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నిర్వహణపై అత్యున్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారిగా భేటీ అయింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో పార్టీల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది.
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ శనివారం భేటీ అయ్యింది. అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు(జమిలీ) నిర్వహించే విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లా కమిషన్, జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంట్‌లో ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించినట్లు కమిటీ వెల్లడించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ హాజరయ్యారు. అడ్వకేట్ హరీశ్ సాల్వే వర్చువల్‌గా పాల్గొన్నారు.