రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌‌‌‌ సంచలనం.. ట్రోఫీలో చరిత్రలోనే తొలిసారి ఢిల్లీపై విజయం

రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌‌‌‌ సంచలనం.. ట్రోఫీలో చరిత్రలోనే తొలిసారి ఢిల్లీపై విజయం

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌‌‌‌ జట్టు సంచలనం సృష్టించింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి బలమైన ఢిల్లీ జట్టుపై గెలిచింది. ఖమ్రాన్‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌ (147 బాల్స్‌‌‌‌లో 20 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో133 నాటౌట్‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. మంగళవారం ముగిసిన ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 1960 నుంచి ఇరుజట్లు 43 సార్లు తలపడగా ఇందులో ఢిల్లీ 37సార్లు గెలవగా.. జమ్మూ కశ్మీర్‌‌‌‌ ఒక్క విజయం కూడా సాధించలేదు. 

తాజా విజయంతో ఢిల్లీ ఆధిపత్యానికి జమ్మూ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. 179 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌‌లో 55/2 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్‌‌‌‌ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌‌‌ను అందుకుంది. చివరి రోజు విజయానికి 124 రన్స్‌‌‌‌ అవసరం కాగా నైట్‌‌‌‌ వాచ్‌‌‌‌మన్‌‌‌‌ వన్షజ్‌‌‌‌ శర్మ (8)కు ఎక్కువగా చాన్స్‌‌‌‌ ఇవ్వకుండా ఖమ్రాన్‌‌‌‌ ఫోర్లు, సిక్స్‌‌‌‌లతో చెలరేగాడు.

ఈ క్రమంలో శర్మతో మూడో వికెట్‌‌‌‌కు 82, కెప్టెన్‌‌‌‌ పారస్‌‌‌‌ డోగ్రా (10 నాటౌట్‌‌‌‌)తో నాలుగో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ జోడించి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. హ్రితిక్‌‌‌‌ షోకిన్‌‌‌‌ రెండు వికెట్లు తీశాడు. అకిబ్‌‌‌‌ నబీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఓవరాల్‌‌‌‌గా ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలు, ఓటమి, డ్రాతో జమ్మూ కశ్మీర్‌‌‌‌ 14 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచి నాకౌట్‌‌‌‌కు చేరువైంది.