
హైదరాబాద్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో వరుస ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవ్, సుధాకర్, చలపతి, భాస్కర్ వంటి అగ్రనేతలను కోల్పోగా.. భద్రతా దళాల భయానికి మరికొందరు నక్సలైట్లు అడవులను వదిలి స్వచ్ఛదంగా లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతల లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
రాచకొండ సీపీ ముందు వీరిద్దరూ సరెండర్ కానున్నారు. గురువారం (జూలై 17) మధ్యాహ్నం 12 గంటలకు లొంగిపోయిన మావోయిస్టులను రాచకొండ సీపీ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారని తెలిసింది. లొంగిపోయే వారిలో జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు అధికారికంగా ధృవీకరించలేదు. గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడుగా ఉన్నారు సంజీవ్. ఇటీవల 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా సంజీవ్ వంటి కీలక నేతలు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బనేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.