విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికెట్ ఆలస్యం కావడంపై KVN ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం (జనవరి 20, 2026) మద్రాస్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సినిమా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని CBFC కోర్టుకు తెలియజేసింది.
CBFC తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్‌ఎల్ సుందరేశన్..‘‘పరీక్షా కమిటీ సూచించిన 14 కట్స్ తాత్కాలికమైనవి మాత్రమేనని, అవి తుది నిర్ణయం కాదని.. ‘మధ్యవర్తి చర్య’గా పరిగణించాలని స్పష్టం చేశారు. సినిమాపై CBFC చైర్‌పర్సన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని’’ ఏఆర్‌ఎల్ సుందరేశన్ కోర్టుకు వివరించారు.
ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపించారనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా, జనవరి 6న నిర్మాతలకు ఈ విషయమై సమాచారం ఇచ్చినట్లు CBFC తెలిపింది. గతంలో సింగిల్ జడ్జి ముందు జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వలేదని కూడా CBFC వాదించింది.
Also Read : ఓటీటీలో కట్టిపడేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..
విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించనున్న తరుణంలో, దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ‘జన నాయగన్’ ఆయన చివరి చిత్రం అన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. అలాగే నిర్మాతలు ఈ చిత్రంపై సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు చేసిన వాదనను కూడా కోర్టు ప్రశ్నించింది. భోజన విరామం అనంతరం KVN ప్రొడక్షన్స్ వాదనలను విననున్నట్లు కోర్టు తెలిపింది. కాసేపట్లో ఫైనల్ తీర్పు రానుంది.
