Vijay Vs Balayya: విజయ్ ‘జన నాయకుడు’.. బాలయ్య ‘భగవంత్ కేసరి’కి కాపీనా? నెట్టింట వైరల్ అవుతున్న పోలికలు!

Vijay Vs Balayya: విజయ్ ‘జన నాయకుడు’.. బాలయ్య ‘భగవంత్ కేసరి’కి కాపీనా? నెట్టింట వైరల్ అవుతున్న పోలికలు!

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ . తెలుగులో ‘జన నాయకుడు’ పేరులో రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ  ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమా కథాంశం నందమూరి బాలకృష్ణ, దర్శకుడుఅనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ ని పోలి ఉందనే విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కూతురు సెంటిమెంట్, ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

భగవంత్ కేసరి వర్సెస్ జన నాయకుడు కాపీనా? ప్రేరణా?

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’లో  వరంగల్ జైలర్ ఓ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన కూతురైన విజ్జి పాప (శ్రీలీల)ను బాలయ్య అన్ని తానై చూసుకుంటాడు. జైలర్ కోరిక మేరకు ఒక ధైర్యవంతురాలైన ఆర్మీ ఆఫీసర్‌గా విజ్జిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆమెకు ఇష్టం లేకపోయినా, శారీరక, మానసిక బలహీనతలను ఎదురించి ఆమెను యుద్ధక్షేత్రానికి సిద్ధం చేసే బాధ్యతను బాలయ్య పాత్ర తీసుకుంటుంది.

ఇప్పుడు ‘జన నాయకుడు’ ట్రైలర్ చూస్తుంటే, సరిగ్గా ఇలాంటి పోలికలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ఆయన కూతురు (లేదా సంరక్షణలో ఉన్న అమ్మాయి) పాత్రలో నటించింది.  భగవంత్ కేసరిలో శ్రీలీల పాత్రలాగే, ఇందులో మమితా బైజు కూడా ఆర్మీలో చేరడానికి విముఖత చూపిస్తుందని, కానీ విజయ్ ఆమెను ఒక వీరనారిలా తీర్చిదిద్దుతారని తెలుస్తోంది.  భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ లాగే, ఇక్కడ బాబీ డియోల్ పాత్ర వల్ల ఆ అమ్మాయి ప్రాణాలకు ముప్పు ఏర్పడటం, హీరో ఆమెను రక్షించుకుంటూనే తన లక్ష్యాన్ని చేరుకోవడం వంటి అంశాలు సేమ్ టు సేమ్ ఉన్నాయని నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సహా పోల్చి చూస్తున్నారు.

దర్శకుడి మార్క్ ఎలా ఉండబోతోంది?

హెచ్. వినోద్ అంటే వాస్తవికతకు దగ్గరగా ఉండే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ‘భగవంత్ కేసరి’లో కామెడీ, పొలిటికల్ , మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే, ‘జన నాయకుడు’లో కూడా పొలిటికల్ టచ్ , వినోద్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్ మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం సెంట్రల్ థీమ్ (కూతురును ఆర్మీ ఆఫీసర్ చేయడం) మాత్రమే కాపీనా? లేక పూర్తి కథలో మార్పులు ఉన్నాయా అన్నది సస్పెన్స్‌గా మారింది.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

ఈ విమర్శలు ఎలా ఉన్నా, విజయ్ తన కెరీర్‌లో చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో దీనిపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ అందించిన సంగీతం అప్పుడే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది. విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు ‘జన నాయకుడు’గా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ‘భగవంత్ కేసరి’తో వస్తున్న పోలికలను ఈ సినిమా తన కథా బలంతో పటాపంచలు చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే...