ఏపీలో కీలక పరిణామాలు.. మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు?

ఏపీలో కీలక పరిణామాలు.. మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు?

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జన సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘7 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటు స్థానాల్లో లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో బరిలోకి దిగుదాం. మీరే డిసైడ్ చేసి చెప్పండి. కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడుదాం..’’ అని తెలంగాణ జనసేన క్యాడర్ కు ఆయన సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలు వృథా అవుతాయన్నారు. పోరాటం చేసే ధైర్యం తనకు తెలంగాణ గడ్డ నుంచే వచ్చిందన్నారు. ఏపీలోని మంగళగిరిలో జనసేన ఆఫీసులో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘వేలాది మంది ఆత్మబలిదానం, త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది.. నాకు స్ఫూర్తినిచ్చే గడ్డ తెలంగాణ’’ అని పవన్ కామెంట్ చేశారు. ‘‘నాది ఆంధ్ర అనే భావన ఆంధ్రా వాళ్లకు లేదు. దీనికి కారణం ఏపీలో చరిత్ర చెప్పేవాళ్లు లేరు’’ అని అన్నారు.‘‘వైజాగ్​లో స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఏపీలో కొంతమందికి కోపం రావడం లేదు’’ అని పవన్​ అన్నారు.  

ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా 

వైసీపీ నేతలు తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపిస్తూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఇక యుద్ధమేనని, దాడులు చేస్తే ప్రతిదాడులకూ సిద్ధమని హెచ్చరించారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని, సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తానంటూ కామెంట్ చేశారు. ‘‘ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. సిద్ధంగా ఉండండి. బీజేపీ, ప్రధాని మోడీ అంటే గౌరవం ఉంది.. కానీ వాళ్లకు ఊడిగం చేయం. మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది” అని పవన్ తెలిపారు. 

పవన్​తో బాబు భేటీ

 ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. మంగళవారం విజయవాడలోని ఓ హోటల్ లో పవన్​తో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గంటసేపు భేటీ అయ్యారు. ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న ఘటనలపై పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు స్వయంగా వెళ్లారు. వీరి భేటీతో ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. రాజకీయ సమీకరణాలు మారొచ్చని, మళ్లీ జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చన్న చర్చ మొదలైంది. పవన్​తో భేటీ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ పొత్తు దిశగా హింట్ కూడా ఇచ్చారు. ‘‘అవసరమైతే మళ్లీ కలుస్తాం.. ముందుకెళ్తాం. పవన్​ను కోరుతున్నాను. అందరం కలుద్దాం. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసొచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తాం’’ అని కామెంట్ చేశారు. చంద్రబాబు తర్వాత పవన్ కూడా మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలతో సంబంధమున్న అంశం కాదిది.. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన విషయం’’ అని చెప్పారు. నిరంకుశ ఏపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ, టీడీపీ, వామపక్షాలన్నింటితోనూ కలిసి పోరాడుతామన్నారు. అయితే, సోమవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పవన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వైసీపీ సర్కారుపై పోరాటానికి బీజేపీతో కలిసి స్పష్టమైన రోడ్ మ్యాప్​తో పోరాటం సాధ్యం కాదన్న అభిప్రాయానికి రావడం వల్లే ఆ మరుసటి రోజే చంద్రబాబుతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.