
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని, తాము ఎక్కడకు పారిపోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్తి కల్పించడమే ధ్యేయంగా వచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు. ‘ఒకవేళ వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయకపోతే.. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్విర్యం అయిపోతుంది. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏపీ వాళ్లు ఉద్యోగాలకు కోసం తెలంగాణకు వెళ్తే.. అక్కడి వాళ్లు నష్టపోతారు’ అని అన్నారు. ప్రశ్నించే సామాన్యులను కూడా భయపెడుతున్నారని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ నేలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఢిల్లీ వరకూ వెళ్లాం. ఇక్కడే తేల్చుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులపై కేసులు పెడుతున్నారని చెప్పారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేత నాగబాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
తమ విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉంటాయని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే జనవాణి ప్రకటించామని అనడం సరికాదని.. వైసీపీ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించడం జనసేన ఉద్దేశం కాదని చెప్పారు. అధికారం మొత్తం కొంతమంది చేతుల్లో పెట్టుకుని.. అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. విశాఖ నగరాన్ని మొత్తం పోలీసులలో నింపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము (జనసేన నాయకులు, కార్యకర్తలు) ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా..? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి విముక్తి చేయాలన్నారు. క్రిమినల్ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న నాయకులు ఉంటే ఇలాగే జరుగుతుందని, ఇది వచ్చే తరానికి అంత మంచిది కాదన్నారు.
పోలీసు అధికారులపై తనకు ఎలాంటి కోపం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది క్రిమినల్స్ రాజకీయ నాయకులకు సలాం కొడుతుంటే దేశం ఈ స్థాయికి దిగజారిపోయిందా అనిపిస్తోంది. దీన్ని గట్టిగా ఎదుర్కొవాలి. క్రిమినల్స్ చేత రాష్ట్రం పాలించబడకూడదని అనుకుంటున్నాను. మా పార్టీ ఉద్దేశం కూడా అదే. రాజకీయాల నుంచి క్రిమినల్స్ నుంచి తీసేయాలనేది నా లక్ష్యం’ అని అన్నారు. వైసీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటి? వైసీపీ నేతలు చేసే భూకబ్జాలు బయటపడతాయనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని అన్నారు.