
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల జాబితాను సోమవారం తెలంగాణ శాఖ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చని చెప్పారు. తాజాగా ప్రకటించిన స్థానాల్లో గత దశాబ్ద కాలంగా పార్టీ, క్యాడర్ బలంగా ఉందని తెలిపారు. త్వరలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ ప్రణాళిక ప్రకటిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు 25 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉందన్నారు.
గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన ఓటింగ్ దీనికి ఉదాహరణ అని చెప్పారు. గత పదేండ్లలో అనేక సమస్యలపై రాష్ట్రంలో జనసేన పోరాటం చేసిందని ఆయన తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు, రాష్ట్రంలో మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థుల సమస్యలపై జనసేన ఉద్యమించిందని గుర్తుచేశారు. త్వరలో పార్టీ ప్రకటించే అభ్యర్థుల లిస్ట్‌లో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ ఇన్‌చార్జి ఎన్.శంకర్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ ప్రెసిడెంట్ ఆర్.రాజలింగం తదితరులు పాల్గొన్నారు.