
ఏపీలో క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
తెలంగాణలో ఇంకా తేలని పొత్తు
హైదరాబాద్, వెలుగు: టీడీపీ, జనసేనల మధ్య తెలంగాణలోనూ పొత్తు ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇటీవల రాజమండ్రిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రెండు పార్టీల పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. రాజకీయంగా బలపడటం కోసం పొత్తు ప్రకటించి అక్కడ లబ్ధిపొందాలనేది ఇరు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోనూ టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్లే అన్న అంచనాలున్నాయి. సీట్ షేరింగ్ మధ్య చర్చలు జరిగాల్సి ఉంది.
అయితే జన సేన ఇప్పటికే తెలంగాణలో 32 సీట్లు పోటీ చేస్తామని చెప్పడంతో పాటు ఆయా స్థానాల జాబితాను ప్రకటించింది. తెలంగాణలో పొత్తు విషయమై.. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరుగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ రెండు పార్టీల పొత్తుతో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
రాజమండ్రి బాట పట్టిన నేతలు..
రాష్ట్రంలో టీడీపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఖరారుపై తేల్చేందుకు ఆ పార్టీ నేతలు రాజమండ్రి బాట పట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు వెళ్లారు. చంద్రబాబును కలిసిన తర్వాత అభ్యర్థుల ఖరారుపై క్లారిటీ రానుంది. తెలంగాణలోని119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు టీడీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
రావుల కూడా వెళ్తే..?
తెలంగాణలో టీడీపీ తమ బలం చాటుకోవాలని చూస్తున్నా.. సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో డైలమా కొనసాగుతోంది. ఇప్పటి వరకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపార్టీకి ఉన్న పెద్ద దిక్కు లేకుండా పోతుంది. కాసాని రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఖమ్మంలో బహిరంగసభ, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కూడా పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉండటంతో ఆ పార్టీ కార్యకలాపాలు తగ్గాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికలపై చర్చించేందుకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహం ఖరారు కావాల్సి ఉంది.