పల్లాకు సొంత ఓటర్ల షాక్​!

పల్లాకు సొంత ఓటర్ల షాక్​!
  • జనగామలో బీఆర్ఎస్​కు తగ్గిన ఓట్లు 
  • అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదు
  • మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్​

జనగామ, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డికి సొంత నియోజకవర్గ ఓటర్లు భారీ షాక్​ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్​పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఉన్న ఏకైక నియోజకవర్గం జనగామనే. అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో బీఆర్​ఎస్​కు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఎంపీ ఎలక్షన్​లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయి. ఈసారి జనగామ ఓటర్లు కాంగ్రెస్​ వైపే మొగ్గు చూపారు. బీజేపీ తన ఓటింగ్​శాతాన్ని పెంచుకుని రెండో స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ ​మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 

కాంగ్రెస్​కు 31 వేల మెజార్టీ.. 

జనగామ నియోజకవర్గంలో 2,42,771 ఓటర్లుండగా లోక్​సభ ఎన్నికల్లో 1,81,328 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 76,032 ఓట్లు కాంగ్రెస్​కు, బీజేపీకి 44,797, బీఆర్ఎస్​కు 43,844 ఓట్లు వచ్చాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా 15,783 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా భువనగిరి పార్లమెంట్​స్థానం నుంచి కాంగ్రెస్ ​అభ్యర్థిగా పోటీ చేసిన చామల కిరణ్​కుమార్​రెడ్డికి జనగామలో 31,235 ఓట్ల మెజారిటీ వచ్చింది. అది కూడా బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యపై కావడం గమనార్హం. బీఆర్ఎస్​తో పోలిస్తే కాంగ్రెస్​కు 32,188 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్​కు అసెంబ్లీ ఎన్నికల్లో 98,975 ఓట్లు రాగా, ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్​కు కేవలం 43,844 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోల్ ​మేనేజ్​మెంట్​లో దిట్టగా పల్లా పేరును పదే పదే చెప్పుకునే బీఆర్ఎస్​ శ్రేణులకు ఎంపీ ఎలక్షన్​ ఫలితాలు ఊహించని షాక్ ను ఇచ్చాయి.