భారీ వర్షానికి జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్ ఉరుస్తోంది

భారీ వర్షానికి జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్ ఉరుస్తోంది

జనగామ, వెలుగు: వాన పడితే సర్కారు బిల్డింగ్​ల పరిస్థితి ఆగమాగం అవుతోంది. శుక్రవారం కురిసిన భారీ వానకు జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్ ఉరుస్తోంది. వారం క్రితం కురిసిన ముసురు వానలకు పలుచోట్ల గోడలు చిమ్మటియ్యడంతోపాటు అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా ఉరిసింది. తాజాగా గట్టి వాన పడడంతో ఏకంగా గోడల జాయింట్ల వద్ద ధారలుగా నీళ్లు బయటకు వస్తున్నాయి. పార్కింగ్​ సెల్లార్​లో పెద్దఎత్తున నీళ్లు నిలవడంతో పారిశుద్ధ్య కార్మికులు వాటిని బయటకు పంపలేక అవస్థలు పడ్డారు. పొద్దంతా చీపుర్లతో ఊడుస్తూ అదే పనిలో ఉండిపోయారు. ఇక జిల్లా పంచాయతీ ఆఫీస్, లేబర్​ఆఫీస్, ఖజానా ఆఫీస్, ఇంటర్​విద్యాశాఖ, డీఎం ఆఫీస్​లతో పాటు పలుచోట్ల గోడలు చిమ్మటిస్తున్నాయి. 

కుంట ఎఫ్​టీఎల్​లో కట్టడంతో..

జనగామ జిల్లా రవాణా శాఖ ఆఫీస్​వానలకు నీట మునిగింది. 2014 లో అప్పటి ఆఫీసర్లు, లీడర్లు రియల్​ వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఓ ఆఫీస్​ బిల్డింగ్​ను వెంచర్​లో నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇది జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోని పెంబర్తి శివారు కంబాల కుంట ఎఫ్ టీఎల్​ పరిధిలో ఉంటుంది. రూల్స్​కు విరుద్ధంగా వెంచర్​కు పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా ఈజీగా అందులోని ప్లాట్లను అమ్ముకోవాలనే కుయుక్తులకు అప్పటి పాలకులు, ఆఫీసర్లు తలూపారు. ఫ్రీగా ఆర్టీఏ ఆఫీస్​కు స్థలం వస్తోందంటూ కుంట అని చూడకుండా కండ్లు మూసుకుని సుమారు రూ. 70 లక్షలతో నిర్మాణం మొదలు పెట్టారు. రెండేండ్ల క్రితం బిల్డింగ్ ​నిర్మాణం పూర్తయినా వానాకాలం సీజన్​లో అది మునిగిపోతుందన్న భయంతో ఆర్టీఓ ఆఫీస్​ను అక్కడికి మార్చేందుకు వెనకడుగు వేశారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసిన రమేశ్​రాథోడ్​ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సింగం శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల క్రితం కొత్త బిల్డింగ్​లోకి ఆఫీస్​ను మార్చారు. వానలతో ఆఫీస్​చుట్టూ నీళ్లు నిండాయి. ఈ నీళ్లు ఇప్పట్లో ఖాళీ అయ్యే పరిస్థితి లేదు.  లైసెన్స్​లు, రిజిస్ట్రేషన్​ల కోసం వచ్చేవారికి ఏ విధంగా సేవలందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

టీఆర్ఎస్,​ బీజేపీ వాగ్వాదం

ఎఫ్​టీఎల్​పరిధిలో ఆర్టీఓ ఆఫీస్​నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తాయని బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​వారణాసి పవన్​శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆఫీస్​ వద్ద నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్​ లీడర్లు నిమ్మతి మహేందర్​రెడ్డి, రాజు తదితరులు బీజేపీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీడీపీ లీడర్లు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు.