తప్పులు లేకుండా రీవ్యాల్యుయేషన్ చేయండి: విద్యాశాఖ కార్యదర్శి

తప్పులు లేకుండా రీవ్యాల్యుయేషన్ చేయండి: విద్యాశాఖ కార్యదర్శి

ఇంటర్ పేపర్ల రీవ్యాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు లేకుండా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి. మే 8 నాటికి రీవ్యాల్యుయేషన్ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్పిరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఇంటర్ పేపర్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఎలా జరగుతుందనే దానిపై ఆరా తీశారు.

13 కేంద్రాల్లో ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుగుతున్నాయన్నారు జనార్ధన్ రెడ్డి. ఈ కేంద్రాల్లో రోజు  60 వేల నుంచి లక్షా 50వేల పేపర్ల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ధరణి వెబ్ సైట్ కు వాడిన స్కానర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సమయం తక్కువ ఉండటంతో.. పేపర్ల వెరిఫికేషన్, కౌంటింగ్ లో వేగం పెంచాలన్నారు. మొత్తం 3 లక్షల 28 వేల విద్యార్దుల పేపర్లను ఇన్ టైంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేయాలని సూచించారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడటంతో.. ఈసారి చిన్న తప్పిదాలు కూడా లేకుండా.. ఒకటికి, రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ఫైనల్ మార్కులు వేయాలన్నారు జనార్థన్ రెడ్డి. ముందుగా పేపర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసి ఆ తరువాత విద్యార్థుల హాల్ టికెట్ ప్రకారం మార్కులను పొందుపరుస్తున్నామని తెలిపారు.

వివాదాలకు కారణమైన గ్లోబరీనా సంస్థతోనే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే గ్లోబరీనాపై తీవ్ర విమర్శలు రావడంతో.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నరెన్స్ సహాయం కూడా తీసుకుంటోంది ఇంటర్ బోర్డ్. ఇప్పటికిప్పుడు గ్లోబరీనా సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోలేకే..  అదే సంస్థతో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేస్తున్నామన్నారు అధికారులు. ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కేంద్రాలపై సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని చెప్పారు.