భేటీ రహస్యం వీడింది... జగన్​ను ఇంటికి పంపడమే మా నినాదం : నాదెండ్ల మనోహర్​

భేటీ రహస్యం వీడింది... జగన్​ను ఇంటికి పంపడమే మా నినాదం : నాదెండ్ల మనోహర్​

ఎవరైనా ఇద్దరు రాజకీయ పార్టీల నేతలు భేటీ అయ్యారంటే .. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు.. ఎందుకు కలిశారు..వారి సంభాషణ ఎలా సాగింది. అనే అంశాలను రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి. తాజాగా శనివారం ( ఏప్రిల్​ 29) చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ భేటి అయ్యారు.  వారు ఏం చర్చించుకున్నారు అనే అంశాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్​  రివీల్​ చేశారు. 

భేటీ వెనుక అసలేం జరిగింది..!?

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే తమ విధానం, నినాదమని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు.  శనివారం ( ఏప్రిల్​ 29)   చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు. భవిష్యత్‌లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సీట్లపై ప్రచారాలు ఊహాగానాలు మాత్రమేనన్నారు 

కర్నాటక ఎన్నికల తర్వాత మరింత స్పష్టత 

కొద్దిరోజుల క్రితం పవన్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీలోని వివిధస్థాయి నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండాలో వారితో చంద్రబాబుతో పవన్ కొంత చర్చించారు. ఆ అంశాలు శనివారం వీరి భేటీలో చర్చకు వచ్చాయని సమాచారం. కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రంలో మరింత స్పష్టత వస్తుందని, ఆ ఫలితాల తర్వాత మరోసారి భేటీ కావాలని ఉభయులూ నిశ్చయించుకొన్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, వివిధ వర్గాల వారి నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌, అధికార పార్టీ తన ప్రచారానికి అమలుచేస్తున్న వ్యూహం... దానిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణ కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున రూపొందిస్తున్న కార్యాచరణను కూడా పవన్‌ వివరించారు. చంద్రబాబు-పవన్ భేటీ అలా ముగిసిందో లేదో సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. మొత్తానికి చూస్తే.. చంద్రబాబు-పవన్ భేటీ ఇకపై వరుసగా ఉంటాయన్న మాట. ఈ భేటీల్లో ఫైనల్‌గా ఏం తేలుస్తారా..? కలిసి అడుగులు ముందుకేస్తారా..? లేదా అనేదానిపై అటు టీడీపీలో.. ఇటు జనసేనలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏకాంత సమావేశం 

పవన్ ఒక్కరే రాగా.. చంద్రబాబు కూడా ఒక్కరే ఏకాంతంగా సమావేశమయ్యారు. గతంలో వారిద్దరూ కలిసిన ప్రతిసారీ తమ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేవారు. ఈసారి అటువంటిదేమీ జరగలేదు. తమ భేటీ జరిగినట్లుగా ఫొటోలు, వీడియోలు మాత్రమే విడుదల చేశారు. తాజా రాజకీయ పరిణామాలపైనే వారి భేటీ జరిగినట్లు ఆయా పార్టీలవర్గాలు తెలిపాయి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి..? ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై చంద్రబాబు-పవన్ భేటీలో చర్చించారని తెలుస్తోంది. అయితే నిన్నటి భేటీలో ఏం జరిగింది..? ఏమేం చర్చించారు..? భవిష్యత్తులో మరిన్ని చర్చలు ఉంటాయా..? ఇలాంటి విషయాలపై జనసేన పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్   మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడించారు