- తక్కువ ఫీజుకే ఔట్ పేషెంట్ సేవలు
- నాణ్యమైన వైద్యం అందించేందుకు హెచ్‌ఆర్‌డీఏ కొత్త ఆలోచన
- శామీర్‌పేట్‌లో తొలి క్లినిక్ ప్రారంభం.. త్వరలోనే జిల్లాల్లో మరిన్ని ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఊర్లల్లో తక్కువ ఫీజుకే ఓపీ సేవలు అందించేందుకు జనతా క్లినిక్‌లు వస్తున్నాయి. నకిలీ డాక్టర్లకు చెక్‌పెట్టేలా ఎంబీబీఎస్ డాక్టర్లతో వైద్యం అందించనున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, పెద్ద హాస్పిటళ్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డీఏ) వీటిని ఏర్పాటు చేస్తున్నది. సోమవారం మొదటి క్లినిక్‌ను శామీర్‌పేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి క్లినిక్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కనీస వేతనం, వసతి కల్పిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేసేందుకు ఎంతోమంది ఎంబీబీఎస్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి డాక్టర్లను, ఇన్వెస్టర్లను, దాతలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన, మంచి ట్రీట్‌మెంట్ అందించడమే తమ ఉద్దేశమని వివరించారు. దీని వల్ల యువ డాక్టర్లకు ఉపాధి దొరుకుతుందని, గ్రామాల్లో నకిలీ డాక్టర్లకు చెక్ పడుతుందని చెప్పారు. జనతా క్లినిక్‌లో ఓపీ చార్జ్ తక్కువగా ఉంటుందన్నారు. ఓపీ ద్వారా వచ్చే మొత్తాన్ని అక్కడ పనిచేసే డాక్టర్‌కే ఇస్తామన్నారు. క్లినిక్‌లో పనిచేసే డాక్టర్‌కు నెలకు కనీసం రూ.70 వేల ఆదాయం ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నారు. ఓపీ ద్వారా రూ.40 వేలు వస్తే, దాతల నుంచి సేకరించి మిగిలిన రూ.30 వేలు తమ అసోసియేషన్ చెల్లిస్తుందన్నారు.
ఓపీ ఫీజు రూ.70 వేల కంటే ఎక్కువ వస్తే..
ఓపీ ద్వారా రూ.40 వేలు వస్తే, దాతల నుంచి సేకరించి మిగిలిన రూ.30 వేలు తమ అసోసియేషన్ చెల్లిస్తుందని అన్నారు. ఒకవేళ ఓపీ ఫీజు రూ.70 వేల కంటే ఎక్కువ వస్తే, అవి కూడా డాక్టర్‌కే చెందుతాయని చెప్పారు. డాక్టర్ల వసతి బాధ్యతలు కూడా తమ అసోసియేషన్ తీసుకుంటుందన్నారు. స్థానికంగా అకామిడేషన్ కల్పించి, రాత్రి పగలు జనాలకు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం తొలి అడుగు పడిందని, త్వరలోనే ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకోసం కొంత మంది ముందుకొచ్చారని మహేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, దాతలు చేయూతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆసక్తి ఉన్నవాళ్లు 9912878749 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. హెచ్‌ఆర్‌డీఏలో ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు భాగస్వామ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఐదేండ్లుగా హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, డాక్టర్ల సమస్యల పరిష్కారానికి సైతం కృషి చేస్తున్నట్లు మహేశ్ చెప్పారు.
