- యూపీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ హై కమాండ్
తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ హై కమాండ్ నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మున్నూరు కాపు (బీసీ) కులానికి చెందిన లక్ష్మణ్ గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణ మీద ఫోకస్ పెంచిన హై కమాండ్ ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని మొదటి నుంచి భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రం నుంచి పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తుండడంతో బీసీ కులానికి చెందిన నేతను ఎంపిక చేయాలని భావించారు. అందులో భాగంగానే లక్ష్మణ్ పేరును హై కమాండ్ రాజ్యసభకు ఖరారు చేసింది. పార్టీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్ ఇద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడైనా రావచ్చనే వాతావరణం నెలకొనడంతో ఇక్కడి పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపేందుకు, బీసీ ఓటు బ్యాంకు పెంచుకొనేందుకు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం : -
మల్లారెడ్డి కాన్వాయ్పై దాడి.. రేవంత్ అనుచరులపై కేసు
పల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచుల డిమాండ్
