కాంగ్రెస్‌‌లో టికెట్‌‌ టెన్షన్‌‌.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి మధ్య టికెట్‌‌ వార్‌‌

కాంగ్రెస్‌‌లో టికెట్‌‌ టెన్షన్‌‌.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి మధ్య టికెట్‌‌ వార్‌‌
  • నేను సైతం అంటున్న పొన్నాల కోడలు వైశాలి
  • ఈ ముగ్గురితో పాటు మరో 8 మంది అప్లికేషన్‌‌
  • టికెట్‌‌ ఎవరికి దక్కుతుందోనని కేడర్‌‌లో టెన్షన్‌‌

జనగామ, వెలుగు :  జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌‌ టికెట్‌‌ అటు లీడర్లు, ఇటు కేడర్‌‌లోనూ ఉత్కంఠ రేపుతోంది. టీపీసీసీ మాజీ చీఫ్‌‌ పొన్నాల లక్ష్మయ్యకు మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి మధ్య ఇప్పటికే పోటాపోటీగా టికెట్‌‌వార్‌‌ నడుస్తోంది. తాజాగా పొన్నాల కోడలు వైశాలి కూడా రంగంలోకి దిగింది. వీరు ముగ్గురే కాకుండా ఈ స్థానం కోసం మరో 8 మంది అప్లై చేసుకున్నారు. దీంతో టికెట్‌‌ ఎవరికి దక్కుంతుందోనన్న టెన్షన్‌‌ లీడర్లలో నెలకొంది.

బీసీ కార్డుపై పొన్నాల ధీమా

జనగామ టికెట్‌‌ కోసం పొన్నాల లక్ష్మయ్య తన సీనియారిటీతో పాటు బీసీ కార్డును నమ్ముకున్నారు. దీనికి తోడు ప్రదేశ్‌‌ ఎలక్షన్‌‌ కమిటీ సభ్యుడిగా అభ్యర్థుల స్క్రీనింగ్‌‌లో భాగస్వామి అవుతుండడంతో తనకు కాదని మరొకరికి టికెట్‌‌ ఎలా ఇస్తారని అనుచరుల్లో భరోసా నింపుతున్నారు. బయట జరిగే ప్రచారమంతా ఊహాగానాలేనని, ఒకప్పుడు టికెట్లు కేటాయించిన తనకు టికెట్‌‌ దక్కకపోవడం అనే ప్రశ్నే లేదని ధీమాగా ఉన్నారు. ప్రతీ పార్లమెంట్‌‌ పరిధిలో రెండు స్థానాలు బీసీలకు కేటాయించాలన్న ఏఐసీసీ నిర్ణయం కూడా తనకు కలిసి వస్తుందని చెబుతున్నారు. 

టికెట్‌‌ కోసం కొమ్మూరి ప్రయత్నం

గత ఎన్నికలకు కొద్ది కాలం ముందు కాంగ్రెస్‌‌లో చేరిన కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి అప్పుడు టికెట్‌‌ అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం టికెట్‌‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో జనగామ జిల్లా కాంగ్రెస్‌‌ కేడర్‌‌ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఆధిపత్య పోరు నడుస్తోంది. సీఎల్పీ లీడర్​మల్లు భట్టి విక్రమార్క ఇటీవల జనగామ నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్​మార్చ్​యాత్రలో ఇరువర్గాల ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

 తర్వాత కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. దీనిని వ్యతిరేకించిన పొన్నాల డీసీసీ ప్రెసిడెంట్‌‌గా కొమ్మూరిని ఒప్పుకునేది లేదని ప్రకటించడంతో ఇరువర్గాల మధ్య అగ్గి మరింత రాజుకుంది. అయితే టీపీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి సహకారంతో కొమ్మూరికి పదవి దక్కినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే ఈ సారి ఎమ్మెల్యే టికెట్‌‌ కూడా కొమ్మూరికే ఖాయమన్న ధీమాలో ఆయన కేడర్‌‌ ఉంది. 

నేను సైతం అంటున్న  పొన్నాల కోడలు

పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి కూడా జనగామ ఎమ్మెల్యే టికెట్‌‌ కోసం అప్లై చేసుకుంది. గతంలో పొన్నాల మంత్రిగా పనిచేసిన టైంలో అన్నీ తానై నియోజకవర్గాన్ని ఏలిన వైశాలి తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల రంగంలోకి దిగి టికెట్‌‌ కోసం ప్రయత్నిస్తుండడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. జనగామ టికెట్‌‌ కోసం ఈ ముగ్గురితో పాటు మొగుళ్ల రాజిరెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, గిరి కొండల్‌‌రెడ్డి, రంగు భాగ్యలక్ష్మి, మాసాన్‌‌పల్లి లింగాజీ, వి.నర్సయ్య, గంగసాని రాజేశ్వర్‌‌రెడ్డి సైతం అప్లై చేశారు. ఒకవేళ తనకు టికెట్‌‌ రాకపోతే తన కోడలు వైశాలికి అయినా ఖరారు చేయాలన్న ఎత్తుగడతో పొన్నాల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.