బీఆర్ఎస్ లో జనగామ టికెట్ లొల్లి.. పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దు

బీఆర్ఎస్ లో జనగామ టికెట్ లొల్లి..  పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దు

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది.  ఇప్పటికే ఇరు వర్గాల నేతలు విడివిడిగా భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దని.. పల్లాకు టికెట్ ఇవ్వొద్దంటూ కోరుతున్నారు ముత్తిరెడ్డి వర్గం నేతలు.  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే కేసీఆర్ మూడోసారి టికెట్ ఇస్తారని చెప్పారు. ఈ  సారి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటామన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం నియోజకవర్గాకి చెందిన పలువురు నేతలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇక్కడి ప్రజలు నమ్మబోరని..  జనగామకు రెండేళ్లలో ఆయన చేసిందేమి లేదన్నారు.   మూడోసారి ముత్తిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.  డెబ్బై ఏళ్లుగా వెనబడ్డ నియోజకవర్గం ముత్తిరెడ్డి వల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యకర్తలకు ముత్తిరెడ్డి అండగా నిలిచారన్నారు. 

జనగామ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లొల్లి నడుస్తోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి.. స్థానిక నేతలకు మధ్య విభేదాలు రావడంతో..వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని.. మరెవ్వరికి ఇచ్చిన తమకు సహకరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను  ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నట్టు.. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది