12 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్.. టీ20 క్రికెట్‪లో జపాన్ సంచలనం

12 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్.. టీ20 క్రికెట్‪లో జపాన్ సంచలనం

టీ20 క్రికెట్‪లో జపాన్ క్రికెట్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 205 పరుగుల తేడాతో విజయం సాధించి తన ఉనికిని ఘనంగా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‪లో ఇది నాలుగో అతి పెద్ద విజయం. మొదట జపాన్ 217 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మంగోలియా 12 పరుగులకే కుప్పకూలింది. 

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మంగోలియా జట్టు.. జపాన్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే జపనీయులు.. ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఇరు జట్ల మధ్య బుధవారం(మే 08) మూడో టీ20 జరగ్గా.. జపాన్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. సబౌరీష్ రవిచంద్రన్(69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెండెల్ ఫ్లెమింగ్(32), ఇబ్రహీం తకహషి(31) పరుగులు చేశారు. అనంతరం భారీ చేధనకు దిగిన మంగోలియా జట్టు 12 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మంగోలియన్లలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. చేసిన 12 పరుగుల్లోనూ 3 ఎక్సట్రాల రూపంలో వచ్చినవే. జపాన్ బౌలర్లలో కజుమా స్టాఫోర్డ్ 5 వికెట్లతో చెలరేగాడు.

టీ20 క్రికెట్‪లో అతి పెద్ద విజయాలు

  • నేపాల్: 273 పరుగుల తేడాతో విజయం (మంగోలియాపై, 2023)
  • చెక్ రిపబ్లిక్: 257 పరుగుల తేడాతో విజయం (టర్కీపై, 2019)
  • కెనడా: 208 పరుగుల తేడాతో విజయం (పనామాపై, 2021)
  • జపాన్: 205 పరుగుల తేడాతో విజయం (మంగోలియాపై, 2024)
  • మలేషియా: 194 పరుగుల తేడాతో విజయం (థాయిలాండ్‌పై, 2023)