నెట్ఫ్లిక్స్ వీడియోలన్నీ ఒక్క సెకండ్లో డౌన్లోడ్ .. రికార్డు సృష్టించిన జపాన్ హై స్పీడ్ ఇంటర్నెట్

నెట్ఫ్లిక్స్ వీడియోలన్నీ ఒక్క సెకండ్లో డౌన్లోడ్ .. రికార్డు సృష్టించిన జపాన్ హై స్పీడ్ ఇంటర్నెట్

టోక్యో: జపాన్ అంటేనే గుర్తుకొచ్చేది టెక్నాలజీ. హై స్పీడ్ రైల్ నెట్​వర్క్, బెస్ట్ ఎయిర్​పోర్టులు, ఎంతటి తీవ్రమైన భూకంపాలనైనా తట్టుకుని నిలబడే బిల్డింగ్​లు జపాన్​లోనే కనిపిస్తాయి. తాజాగా ఈ దేశం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత హై స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన కంట్రీగా జపాన్ నిలిచింది. ఎంత స్పీడ్ అంటే.. కండ్లు మూసి తెరిచేలోగా నెట్​ఫ్లిక్స్​లో ఉన్న డేటా మొత్తం డౌన్​లోడ్ అయ్యేటంత. అవును.. ఒక సెకన్​లోనే నెట్​ఫ్లిక్స్​లో ఉన్న వీడియోలన్నీ డౌన్​లోడ్ అవుతాయి. కేవలం ఒకే ఒక సెకండ్ కు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్ అంటే 10 లక్షల జీబీలు) డేటా ట్రాన్స్​ఫర్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా ఇంటర్​నెట్ స్పీడ్​తో పోల్చుకుంటే.. సుమారు 1.6 కోట్ల రెట్లు అధికం. 

మన దేశంలో సెకన్​కు యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీగా ఉంది. అటు అమెరికాతోనూ పోల్చుకుంటే జపాన్ ఇంటర్నెట్ స్పీడ్ 3.5 మిలియన్ టైమ్స్ అధికం అని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్​ఐసీటీ) తెలిపింది. ఒక కోటి 8కే క్వాలిటీ వీడియోలను ఏకకాలంలో స్ట్రీమ్ చేయొచ్చు. లేదంటే 6.70 కోట్ల పాటలను సెకన్​లో డౌన్‌‌‌‌లోడ్ చేయొచ్చు. ఇంగ్లిష్ వికీపీడియాలోని డేటాను సెకన్​లో 10వేల సార్లు డౌన్​లోడ్ చేయొచ్చు. సెకన్​లోనే 10వేల 4కే క్వాలిటీ సినిమాలను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని ఎన్​ఐసీటీ తెలిపింది. ఇంతటి ఇంటర్​నెట్ స్పీడ్ కోసం 19 -కోర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌‌‌‌ను ఉపయోగించారు. ఇందుకోసం సైంటిస్టులు ట్రాన్స్‌‌‌‌మీటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్‌‌‌‌ సర్క్యూట్లను వినియోగించారు. 

ఈ లూపింగ్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ ఒక్కోటి 86.1 కిలో మీటర్ల పొడవు ఉంది. ఇలాంటి 21 లూప్స్‌‌‌‌ నుంచి సిగ్నళ్లు వెళ్లి డేటాను అందిస్తాయి. దీని సాయంతోనే సెకనుకు 1808 కిలో మీటర్ల దూరం వరకు డేటాను పంపించేందుకు వీలవుతుంది. ఎలక్ట్రిక్ ఫైబర్ కేబుల్​ను సుమిటోమో ఎలక్ట్రిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఇంటర్నేషనల్ టీమ్ హెల్ప్​తో ఎన్​ఐసీటీ ట్రాన్స్​మిషన్ సిస్టమ్​ను బిల్డ్ చేసింది. 2024లో సెకన్​కు 402 టెరాబిట్స్ స్పీడ్ ఉండగా.. దాన్ని తాజాగా 1.02 పెటా బైట్స్ స్పీడ్​కు పెంచారు.