తెలంగాణ యూత్‌‌‌‌కు జపాన్ టెక్నాలజీ.. భాష, ఉద్యోగ కల్పనపై కుదిరిన అవగాహన ఒప్పందాలు

తెలంగాణ యూత్‌‌‌‌కు జపాన్ టెక్నాలజీ.. భాష, ఉద్యోగ కల్పనపై కుదిరిన అవగాహన ఒప్పందాలు
  • పరిశ్రమలకు విద్యాసంస్థల అనుసంధానం.. ఏటీసీలకు సాంకేతికత బదిలీ 
  • ఒసాకా–తెలంగాణ మధ్య నైపుణ్యాభివృద్ధి, జపనీస్ భాష, ఉద్యోగ కల్పనపై కుదిరిన అవగాహన ఒప్పందాలు
  • కిండాయ్ వర్సిటీ, ఒసాకా వైస్ గవర్నర్‌‌‌‌తో మంత్రి వివేక్ వెంకటస్వామి బృందం భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువత నైపుణ్యాలకు జపాన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు జపాన్​ దేశ పర్యటనలో ఉన్న శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లకు (ఏటీసీ) జపాన్ సాంకేతిక బదిలీ, కిండాయ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. 

ఒసాకా ప్రావిన్స్‌‌తో నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల మార్పిడికి సంబంధించి సమగ్ర పరస్పర సహకార అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) ప్రభుత్వం రూపకల్పన చేసింది.  మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, టామ్‌‌కామ్‌‌ జీఎం నాగభారతిల ఉన్నతస్థాయి బృందం ఒసాకా పర్యటనలో ఈ కార్యాచరణను ఖరారు చేసింది. ప్రతిష్టాత్మక కిండాయ్‌‌ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి బృందం.. విద్యార్థుల ఉన్నత విద్య, సాంకేతిక మార్పిడి కార్యక్రమాలపై చర్చలు జరిపింది.

 అణుబాంబు విధ్వంసం నుంచి అగ్రగామిగా ఎదిగిన జపాన్ వర్సిటీ–ఇండస్ట్రీ అనుసంధాన విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తీర్మానించారు. విద్యార్థులు కళాశాలలో చదువుతున్నప్పుడే మార్కెట్ అవసరాలు, సరికొత్త సాంకేతికతపై శిక్షణ పొందే ఆధునిక విద్యా విధానాన్ని మన విద్యాసంస్థల్లో అనుసంధానించనున్నారు. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేలా జపాన్ విద్యావేత్తలతో ప్రత్యేక పాఠ్యప్రణాళికను సిద్ధం చేయనున్నారు. 

ఇరు ప్రాంతాల అధ్యాపకులు, నిపుణులు తమ అనుభవాలు పంచుకునేలా విద్యాపరమైన మార్పిడి ఒప్పందాలను క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. తెలంగాణ విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత సాంకేతిక విద్య, శిక్షణ పొందేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేలా వర్సిటీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. రాష్ట్ర యువత నైపుణ్యాలకు జపాన్ సాంకేతికతను జోడించి గ్లోబల్ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు సాగాయని మంత్రి పేర్కొన్నారు.

ఒసాకా వైస్‌‌ గవర్నర్‌‌ యమగుచితో మంత్రి వివేక్‌‌ బృందం చర్చలు

పర్యటనలో భాగంగా ఒసాకా వైస్‌‌ గవర్నర్‌‌ యమగుచితో మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి బృందం ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించింది. ఒసాకా–తెలంగాణ మధ్య యువతకు అంతర్జాతీయ ఉపాధి మార్గాలను సుగమం చేసేందుకు రూపొందించిన ఎంవోయూ డ్రాఫ్ట్‌‌ను వైస్ గవర్నర్‌‌కు మంత్రి అందజేశారు. రాష్ట్రంలో ఏటా ఉత్తీర్ణులయ్యే వేలాది మంది ఇంజినీరింగ్‌‌ గ్రాడ్యుయేట్లకు జపాన్ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు అధునాతన సాంకేతిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 

తెలంగాణ స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్, టామ్‌‌కామ్‌‌ ఆధ్వర్యంలో అమలవుతున్న జపనీస్ భాషా శిక్షణా తరగతులను మరింతగా విస్తరించనున్నారు. భాషతోపాటే ఆ దేశ పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ప్రత్యేక వృత్తి నైపుణ్యాలను పాఠ్యాంశాల్లో చేర్చి సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పకడ్బందీ శిక్షణ ద్వారా మన ఇంజినీరింగ్ నిపుణులకు జపాన్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు లభించేందుకు మార్గం సుగమమైంది. 

హైదరాబాద్‌‌లోని ‘జపాన్‌‌ డెస్క్‌‌’ సమన్వయంతో విద్యార్థులు, ఉద్యోగార్థులకు వీసా ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. 
ఎలాంటి మధ్యవర్తులు లేకుండా అత్యంత పారదర్శకంగా మన యువత జపాన్ కార్పొరేట్ సంస్థల్లో నియమితులయ్యేలా సహకరిస్తామని ఒసాకా బృందం తెలిపింది. జపాన్‌‌లోని అత్యున్నత శిక్షణా ప్రమాణాలను తెలంగాణలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో అమలు చేయాలని ప్రతిపాదించారు. ఒసాకా ప్రభుత్వంతో సమన్వయానికి ఇరు ప్రాంతాల అధికారులతో కూడిన ప్రత్యేక సంయుక్త వర్కింగ్ గ్రూప్‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో సరికొత్త హైటెక్ పరిశ్రమలు : మంత్రి వివేక్‌‌

నైపుణ్యాభివృద్ధితోపాటు జపాన్ పారిశ్రామిక దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను తెలంగాణకు రప్పించడమే ఈ పర్యటనలోని మరో ప్రధాన ఎజెండా అని మంత్రి వివేక్‌‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతలు, వరల్డ్ క్లాస్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ రాయితీలను జపాన్ పారిశ్రామికవేత్తల ముందుంచారు. రాబోయే రోజుల్లో జపాన్‌‌లోని ప్రముఖ బహుళజాతి సంస్థలు, వాణిజ్య మండళ్ల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ భేటీలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. 

ఈ పెట్టుబడుల రాకతో రాష్ట్రంలో సరికొత్త హైటెక్ పరిశ్రమలు ఏర్పాటై స్థానిక యువతకు మెరుగైన కొలువులు లభిస్తాయని స్పష్టం చేశారు. పరిశ్రమలు–విద్యాసంస్థల సమన్వయమే ఆర్థిక పురోగతికి బలమైన శక్తి అని, ఆ దిశగానే ప్రభుత్వ దీర్ఘకాలిక పాలసీలు ఉంటాయని చెప్పారు. విద్య, పరిశోధన, వృత్తి నైపుణ్యం, అంతర్జాతీయ ఉపాధిని ఒకే గొడుగు కిందకు తెచ్చి తెలంగాణను గ్లోబల్ టాలెంట్ హబ్‌‌గా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యమని పేర్కొన్నారు.