సామాన్యుడిని పెండ్లాడి ప్యాలెస్‌‌ ను వదిలిన రాకుమారి

సామాన్యుడిని పెండ్లాడి ప్యాలెస్‌‌ ను వదిలిన రాకుమారి
  • ఎట్టకేలకు సామాన్యుడిని మనువాడిన మకో

టోక్యో: రాజుల కుటుంబాల్లో పెండ్లిళ్లంటే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఆ డెకరేషన్లు, ఆ వేడుకలు, ఆ భోజనాలు.. అంతా వేరే లెవెల్​లో ఉంటుంది. కానీ జపాన్​ యువరాణి మకో పెండ్లి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా జరిగింది. పెండ్లి తర్వాత విందు లేదు. పెండ్లయ్యాక జరిగే సంప్రదాయ కార్యక్రమాలూ లేవు. పెండ్లి జరిగినట్టు రాయల్​ ప్యాలెస్​ మంగళవారం ఒక లెటర్​ మాత్రం విడుదల చేసింది. తన మనసుకు నచ్చిన ఓ సాధారణ యువకుడు కొమురోను పెండ్లి చేసుకోవడానికి జపాన్​ యువరాణి మకో తన రాయల్​స్టేటస్​నే వదిలేసింది. పెండ్లి తర్వాత రాజ భరణం కింద ఇచ్చే రూ. 10 కోట్ల డబ్బును కూడా తీసుకోబోనంది.

జపాన్​ చక్రవర్తి తమ్ముడి కూతురు మకో

జపాన్​ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కూతురు మకో. టోక్యో ఇంటర్నేషనల్​ క్రిస్టియన్​ యూనివర్సిటీలో కొమురో, మకో క్లాస్​మేట్స్. 2018లో తాము పెండ్లి చేసుకుంటామని 2017లోనే వీళ్లిద్దరూ ప్రకటించారు. అయితే కొమురో తల్లి ఫైనాన్షియల్​ వ్యవహారాలపై వివాదం రేగడంతో పెండ్లి జరగలే. దీంతో కొమురో 2018లో లా చదివేందుకు న్యూయార్క్ వెళ్లారు. గత నెలలో చదువు పూర్తయ్యాక తిరిగి జపాన్​ వచ్చారు. దీంతో ఈ జంట మళ్లీ పెండ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే కొమురో తల్లి తన మాజీ ఫియాన్సీ నుంచి పొందిన డబ్బు లోన్​గా తీసుకుందా లేక గిఫ్ట్​గానా చెప్పాలని కొమురోను మకో తండ్రి క్లారిటీ అడిగారు. దానికి కొమురో రాతపూర్వకంగా జవాబివ్వగా ఆయన పెండ్లికి ఓకే చెప్పారు. అయితే వివాదం పూర్తిగా సద్దుమణిగిందా లేదా మాత్రం  క్లారిటీ ఇవ్వలేదు. మ్యారేజ్​తర్వాత మకో ప్యాలెస్​ వదిలి బయలుదేరింది. వెళ్లేముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది. సోదరి కకోను కౌగిలించుకుంది.

మీడియాతో నేరుగా మాట్లాడలే..

పెండ్లి తర్వాత రాయల్​ ఫ్యామిలీ జంట మీడియాతో మాట్లాడతారు. కానీ మకో, కొమురో మీడియాతో నేరుగా మాట్లాడలే. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులను రాసిచ్చారు. తన మనసుకు నచ్చిన కొమురోను పెండ్లి చేసుకున్నానని మకో చెప్పారు. ‘నాకు మకో అంటే ప్రేమ. నాకు నచ్చిన వాళ్లతో జీవించాలనుకున్నా’ అని కొమురో తెలిపారు. ఈ జంట న్యూయార్క్​ వెళ్లి సాధారణ ప్రజల్లా జీవించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ యువరాణి బయటి వ్యక్తిని పెండ్లి చేసుకొని డబ్బు తీసుకోకుండా వెళ్లడం ఇదే తొలిసారి.