న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 99 వికెట్లతో ఉన్న యార్కర్ కింగ్ బ్రెవిస్‌ను ఔట్ చేసి వంద వికెట్ల మైలురాయి అందుకున్నాడు.
తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. బుమ్రా కంటే ముందు టిమ్ సౌతీ, లసిత్ మలింగ, షకీబ్ అల్ హసన్, షహీన్ షా అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ సాధించారు. తాజాగా బుమ్రా వీరి సరసన చేరాడు. టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ బుమ్రా కంటే ముందే భారత తరుఫున అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
►ALSO READ | FIH మెన్స్ జూనియర్ వరల్డ్ కప్: కాంస్యమైనా దక్కేనా?
2016 జనవరి 23న సిడ్నీలో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటి వరకు 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 81 టీ20ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో పాండ్యా మెరుపులు మెరిపించడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో తొలి టీ20లో టీమిండియా సునాయస విజయం సాధించింది. సౌతాఫ్రికాను 101 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి.. ఐదు మ్యాచుల సిరీస్‌లో 1–0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే:
- అర్ష్‌దీప్ సింగ్ - 107 వికెట్లు
- జస్‌ప్రీత్ బుమ్రా - 101 వికెట్లు
- హార్దిక్ పాండ్యా - 99 వికెట్లు
- యుజ్వేంద్ర చాహల్ - 96 వికెట్లు
- భువనేశ్వర్ కుమార్ - 90 వికెట్లు

