
న్యూఢిల్లీ: గాయం కారణంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లండన్ వెళ్లనున్నాడు. వెన్నుపూస చీలిక గాయానికి అక్కడ చికిత్స తీసుకోనున్నాడు. అంతకంటే ముందు ముందుగా పలువురు స్పెషలిస్ట్‌లను కలిసి వారి అభిప్రాయాలు తీసుకుంటాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇందుకోసం ముగ్గురు డాక్టర్ల అపాయింట్‌మెంట్లను తీసుకున్నామని, ఈనెల 7 లేదా 8వ తేదీన బుమ్రా లండన్ వెళ్లనున్నాడని బీసీసీఐ తెలిపింది. అతని వెంట నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ ఆశీష్ కౌశిక్ కూడా ఉంటాడని చెప్పింది. డాక్టర్లను సంప్రదించిన అనంతరం చికిత్సకు సంబంధించి కార్యచరణను సిద్ధం చేస్తామన్నది.