బెంగాల్ ప్రచార బరిలో జయాబచ్చన్

బెంగాల్ ప్రచార బరిలో జయాబచ్చన్
  • తృణమూల్ తరపున ప్రచారం చేయనున్న జయ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారబరిలోకి జయాబచ్చన్ దిగుతోంది. రేపు సోమవారం నుండి తృణమూల్ పార్టీ తరపున ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. జబల్‌పూర్ లో పుట్టిపెరిగిన ఆమె తన సొంత రాష్ట్రమైన బెంగాల్ లో బీజేపీతో హోరాహోరీగా పోరాడుతున్న తృణమూల్ తరపున ప్రచారం చేయనుంది. సినిమాల్లోకి ప్రవేశించి అమితాబ్ ను పెళ్లాడాక ముంబైకే పరిమితమైనా ఆమె తరచూ తన ట్టింటికివచ్చిపోతూ ఉంటున్న విషయం తెలిసిందే. ‘‘బెంగాల్ ప్రజలకు సొంత కూతురే కావాలి.. బయటి వ్యక్తులు వద్దు’’ అంటూ తృణమూల్  ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే తన పుట్టింటి రాజకీయాల వైపు ఆసక్తిగా గమనిస్తున్న ఆమె అదను చూసి ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అదే పార్టీ ఎంపీగా ఉన్న జయాబచ్చన్.. తాను పుట్టి పెరిగిన బెంగాల్ రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు రంగంలోకి దిగుతోంది. టోలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్థానం నుండి ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ ఏకంగా కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియోను బరిలోకి దించింది. ఇతర రాష్ట్రాల్లోని మంత్రులు, ఎంపీలు. బెంగాల్ తో ఏమాత్రం  సంబంధాలున్న వారందర్నీ పశ్చిమ బెంగాల్ లో మొహరించి బీజేపీ జెండా ఎగురవేయాలని తహతాహలాడుతోంది. ఈ నేపధ్యంలో జయాబచ్చన్ రంగంలోకి దిగుతుండడంతో ప్రచారం పర్వం మరింత రసవత్తరంగా మారబోతోంది.