ఇండస్ట్రియల్ హబ్ కు అడుగులు.. 200 పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్

ఇండస్ట్రియల్ హబ్ కు అడుగులు.. 200 పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్
  • బొగ్గునిక్షేపాలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు
  • వేగంగా సాగుతున్న పనులు
  • రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఇండస్ట్రియల్ పార్క్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కేటీపీపీతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ర్టియల్​హబ్​కు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ కార్పొరేషన్​ ఇండస్ర్టియల్​ ఇన్​ప్రాస్ట్రక్చర్​ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. 

జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి గతేడాది మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేయగా, పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నది. 

200 పరిశ్రమల కోసం లేఅవుట్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో జాతీయ రహదారికి సమీపంలో 60ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల లేఅవుట్ పూర్తిచేసి 12 మెటల్ రోడ్లను నిర్మించారు. మెటల్ రోడ్లను సీసీలుగా మార్చి విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. బొగ్గునిక్షేపాలకు అనుగుణంగా చిన్న, మధ్యతరహపరిశ్రమలు స్థాపిస్తారు. పార్కు సమీపానే ఉన్న కేటీపీపీ నుంచి వెలువడే బూడిదతో యాష్ బ్రిక్ ఇతర అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. 

 మొత్తంగా 200 పరిశ్రమలను ఏర్పాటు చేసేలా లేఅవుట్ ను తయారు చేశారు. ఇందులో 500, 1000, 1500 గజాల్లో ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కులో కాలుష్యరహిత పరిశ్రమలు ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పిండిగిర్ని, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రెడీమేడ్  గార్మెంట్, మిర్చి, పసుపు పొడి, గానుగ నూనె తయారీ, యాష్ బ్రిక్, బియ్యం ఉత్పత్తి లాంటి పరిశ్రమల స్థాపనకు ఆసక్తి గలవారు టీజీఐఐసీ వెబ్​సైట్లో పరిశ్రమకు సంబంధించిన మిషనరీ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ వివరాలతో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఎంపికైన వారికి పరిశ్రమ స్థాపనకు లేఅవుట్ కేటాయించనున్నారు. ఎంపికైన వారు రెండేండ్లలో పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  

అభివృద్ధి కనిపిస్తోంది.. 

ఇండస్ట్రియల్ పార్క్ లో  వేసిన రోడ్లతో అభివృద్ధి కనిపిస్తోంది. మా వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే కష్టంగా ఉండేది. సీసీ రోడ్ల నిర్మాణంతో సులభంగా వెళ్లగలుగుతున్నాం. ఇక్కడి గుట్టల నుంచి మట్టి తరలించే వారు. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది.- వెంకటి రాకేశ్, గాంధీనగర్​

వేలాది మందికి ఉపాధి..

ఇండస్ర్టియల్​ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 4000 మందికి ఉద్యోగాలు లభించనుండగా పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. టీఫ్రెడ్ ద్వారా 35 శాతం రాయితీతో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించనున్నారు. టీఐడియా పథకం ద్వారా ఓసీ, బీసీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించనున్నారు. మరోవైపు పార్క్​ అందుబాటులోకి వచ్చి పరిశ్రమల స్థాపన ప్రారంభమైతే గాంధీనగర్, మైలారం పరిసరాల్లో భూములకు డిమాండ్​పెరుగనుంది. మిరప, పసుపు, మొక్కజొన్నలాంటి పంటలు ఇక్కడే నెలకొల్పే పుడ్​ప్రాసెసింగ్​ సెంటర్లకు వెళ్లే అవకాశం ఉండడంతో రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతోంది. వ్యవసాయ కూలీలకూ ఆన్​సీజన్లో ఉపాధి లభించనుంది.