
- జయశంకర్ భూపాలపల్లిలో మాయమవుతున్న ప్రభుత్వ, అటవీ, చెరువు శిఖం భూములు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : చెరువు శిఖం భూముల్లో రియల్ వెంచర్లు దర్శనమిస్తున్నాయి. గొలుసుకట్టు చెరువులు కబ్జాలకు గురవుతున్నా ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడకపోవడంతో అక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రియల్ వ్యాపారులు చెరువు శిఖాలు, వరద కాల్వలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ స్థలాలను సైతం ఆక్రమించి రియల్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు భూముల ధరలు పెరుగగా, ప్రభుత్వ, అటవీ, చెరువు శిఖాలు వందల ఎకరాలు మాయమవుతున్నాయి.
చెరువులు మాయం..
భూపాలపల్లిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గోరింటాల కుంట శిఖం భూమి 22.22 ఎకరాలు ఉన్నట్లుగా ఇరిగేషన్ రికార్డులు చెబుతున్నాయి. ఈ శిఖం భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు 1.32 ఎకరాలను కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేశారని, సదరు రియల్టర్ సర్వే నెంబర్ 209 లో ఉన్న శిఖం భూమిని 213 నెంబర్ గా నాలా కన్వర్షన్ చేసుకొని ఎఫ్టీఎల్ పరిధిలో చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుతోపాటు వెంచర్‌కు తగ్గట్టు రోడ్లను నిర్మించుకున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు ఇక్కడే 15 గుంటలను ప్లాట్లుగా చేసి విక్రయించారు. అలాగే సోమన్ కుంట, తుమ్మల చెరువు, వరద కాలువలపై కన్నేసిన వ్యాపారులు వాటిని నామ రూపాల్లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆఫీసర్ల నిర్లక్ష్యం..
జయశంకర్ భూపాలపల్లి 2017లో మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. బొగ్గు గని, కేటీపీపీ కార్మికులతో పాటు ఉద్యోగులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దీనికి తోడు ఇతర వ్యాపారాలు పెరుగుతుండగా, కబ్జాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా తమ పలుకుబడితో కబ్జాకు తెరలేపి మాయం చేస్తున్నట్లుగా పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. కబ్జాల పర్వాన్ని ఆరికట్టాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కబ్జాదారులకు వంతపాడుతూ కొందరు రెవెన్యూ ఆఫీసర్లు బై నెంబర్లతో శిఖం భూములకు పాస్ పుస్తకాలు జారీ చేయగా, రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ట్రాన్స్ కో ఆఫీసర్లు శిఖం భూముల వెంచర్లకు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి కరెంటు లైన్లు ఏర్పాటు గమనార్హం.
కబ్జాలపై కోర్టులో కౌంటర్..
చెరువు శిఖం కబ్జాలపై సాక్షాలతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ ఆఫీసర్లు హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేశారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఆఫీసులను మినహాయించినా మిగతా ఆక్రమలను తొలగించాలనే డిమాండ్ ప్రజల్లో ఉంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేశారు. కానీ, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వెంచర్ అక్రమాలను తొలగించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Pond Land Encroachments Bhupalapally, Real Estate Illegal Ventures, Chain Ponds Occupied, FTL Land Encroachment Telangana, Bhupalapally Real Estate Scam, Gorintala Kunta Encroachment, Telangana News, Hyderabad Local News, Telugu News, Today News, Latest News, V6 News