
కరీంనగర్, వెలుగు : ప్రజా గాయకురాలు, అరుణోదయ విమలక్కకు తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్మారక స్ఫూర్తి పురస్కారం అందజేశారు. బుధవారం రాత్రి కరీంనగర్ ఫిలింభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పురస్కారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్యాయం, అవినీతి, అక్రమాలు లేని మానవ సమాజం కోసం నాలుగు దశాబ్దాలుగా పోరుబాటలో ప్రతిధ్వనిస్తున్న విమలక్కను గుర్తించి పురస్కారం ప్రదానం చేయడం ఎంతో సముచితమని అభిప్రాయపడ్డారు.
గొంతులేని ప్రజల గొంతుకగానే ఎప్పటికీ ఉంటానని విమలక్క పేర్కొన్నారు. సభకు తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షత వహించగా, కవులు, రచయితలు అన్నవరం దేవేందర్, పొన్నం రవిచంద్ర, కూకట్ల తిరుపతి, బూర్ల వెంకటేశ్వర్లు, సివి కుమార్, గాజోజు నాగభూషణం, సదాశ్రీ పాల్గొన్నారు.