ఇండియన్ డొమెస్టిక్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఉనాద్కట్ ఖాతాలో 121 వికెట్లు ఉన్నాయి. 120 వికెట్లతో సిద్ధార్థ్ కౌల్ తో సంయుక్తంగా టాప్ లో ఉన్న ఈ సౌరాష్ట్ర పేసర్.. ఆదివారం (నవంబర్ 30) ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసుకొని అగ్రస్థానానికి చేరుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి నితీష్ రాణా వికెట్ తీనుకున్నాడు.
జయదేవ్ ఉనద్కత్ 121 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా.. సిద్ధార్థ్ కౌల్ (120 వికెట్లు), పియూష్ చావ్లా (113 వికెట్లు), లుక్మాన్ మెరివాలా( 108 వికెట్లు) ,చామా మిలింద్ (107 వికెట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఉనద్కత్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ సౌరాష్ట్ర ఫాస్ట్ బౌలర్ ను సన్ రైజర్స్ రూ.కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. గత సీజన్ లో ఓవరాల్ గా 7 మ్యాచ్ లాడిన ఉనాద్కట్ 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2026 ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ను రిటైన్ చేసుకుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. యష్ ధుల్ 30 బంతుల్లో 47 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత నితీష్ రాణా 41 బంతుల్లో 76 పరుగులు చేసిజట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆయుష్ బదోనీ 25 బంతుల్లో 33 పరుగులు.. అనుజ్ రావత్ 8 బంతుల్లో 17 పరుగులు చేసి రాణించారు. ఛేజింగ్ లో సౌరాష్ట్ర 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగలిగింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు
జయదేవ్ ఉనద్కట్: 121
సిద్ధార్థ్ కౌల్: 120
పియూష్ చావ్లా: 113
లుక్మాన్ మేరివాలా: 108
చామా మిలింద్: 107
