
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు జరగనుంది. అయితే రెండో టెస్టులో టీమిండియా వెటరన్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ ఆడటం లేదు. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడేందుకు ఉనద్కట్ రెండో టెస్టు నుంచి వైదొలిగాడు.
సౌరాష్ట్ర కెప్టెన్గా ఉన్న ఉనద్కట్..ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే తొలి టెస్టులో అతనికి అవకాశం దక్కలేదు. నాగ్ పూర్ పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా తయారు చేయడంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అటు ఢిల్లీలో జరిగే రెండో టెస్టు పిచ్ను కూడా స్పిన్‌కు సహకరించే విధంగా తయారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమ్లో మూడో ఫాస్ట్ బౌలర్ అవసరం భారత్‌కు లేదు. ఒక వేళ మూడో పేసర్ను తీసుకుంటే రిజర్వ్ బెంచ్లో ఉమేష్ యాదవ్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో జయదేవ్ ఉనద్కట్ను జట్టు నుంచి రిలీజ్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతను రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడనున్నాడు.
ఈ నెల 16 నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. తర్వాతి రోజే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో రంజీ ఫైనలే ఆడేందుకు ఉనద్కట్ నిర్ణయించుకున్నాడు. దీంతో అతన్ని టీమిండియా నుంచి రిలీజ్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.