
- బోటుపై బాంబు దాడితో 11 మంది స్మగ్లర్లు మృతి
- ఆర్మీని బెస్ట్‌గా వాడటమంటే ఇదేనన్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
వాషింగ్టన్: వెనెజులా నుంచి అమెరికాలోకి డ్రగ్స్ ను తీసుకొస్తున్న బోటుపై ఎయిర్ స్ట్రైక్ చేయడం సరైందేనని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సమర్థించుకున్నారు. ‘‘అమెరికన్ పౌరులను విషపూరితం చేస్తున్న డ్రగ్ కార్టెల్ సభ్యులను చంపడం అనేది మన మిలిటరీని బెస్ట్ గా వినియోగించుకోవడం అన్నట్టే” అని ఆయన శనివారం ట్వీట్ చేశారు. అయితే, ‘‘తగిన పద్ధతిని పాటించకుండా ఇతర దేశానికి చెందిన పౌరులను ఇలా దాడి చేసి చంపడం యుద్ధ నేరం కిందకు వస్తుంది” అంటూ పొలిటికల్ కామెంటేటర్ బ్రియాన్ క్రసెన్ స్టీన్ ‘ఎక్స్’లో జేడీ వాన్స్ ను తప్పుపట్టారు.
దీనికి వాన్స్ స్పందిస్తూ.. ‘‘నీవు అలా అనుకుంటే.. నేను అంగీకరించను.. షిట్” అంటూ అభ్యంతరకర పదంతో రిప్లై ఇచ్చారు. కాగా, వెనెజులాకు చెందిన ‘ట్రెన్ డీ అరగ్వా’ డ్రగ్ కార్టెల్ గ్యాంగ్ ను ట్రంప్ ఇటీవల టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించారు. వెనెజులా నుంచి అమెరికాలోకి డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం కోసం కరీబియన్ సముద్రంలో అమెరికా పెద్ద ఎత్తున నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్, బోట్స్ ను మోహరించింది. ఈ నేపథ్యంలో ట్రెన్ డీ అరగ్వా గ్యాంగ్ సభ్యులు 11 మంది బోటులో డ్రగ్స్ తీసుకొస్తుండగా, వైమానిక దాడి చేశామని.. ఈ దాడిలో వారంతా చనిపోయారని శుక్రవారం అమెరికా అధికారులు ప్రకటించారు.
ఈ ఒక్కదాడితోనే ఆగిపోదని, అమెరికాలోకి డ్రగ్స్ తరలించాలని చూస్తే.. ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తోపాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. డ్రగ్ స్మగ్లర్లు ఈ దాడినే ఒక హెచ్చరికగా భావించాలన్నారు. కాగా, వెనెజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు స్వయంగా డ్రగ్ కార్టెల్స్ తో సంబంధాలు ఉన్నాయని, ఆయనను పట్టి ఇచ్చేవారికి 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఇస్తామని కూడా ట్రంప్ ఇంతకుముందు ప్రకటించారు.