ఖమ్మం సభకు హాజరుకాని జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామి

ఖమ్మం సభకు హాజరుకాని జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామి

హైదరాబాద్, వెలుగు:  ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ తొలి రాజకీయ సభకు జేడీఎస్ చీఫ్​,  కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అటెండ్​ కాలేదు. వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు హాజరైన ఈ మీటింగ్​ కు ఆయన ఎందుకు హాజరుకాలేదు ? అనే దానిపై ఇప్పుడు హాట్​ డిబేట్​ జరుగుతోంది. కేసీఆరే ఆహ్వానించలేదా ? కుమారస్వామే రాలేదా ? అనే కోణాల్లో తీరొక్క విశ్లేషణ వినిపిస్తోంది. 

గత నాలుగు నెలల్లో మూడుసార్లు కేసీఆర్​ను కలిసిండు..

జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామి కిందటేడాది సెప్టెంబర్ 11న ప్రత్యేక విమానంలో హైదరాబాద్​ కు వచ్చి , సీఎం కేసీఆర్ ను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం దసరా పండుగ రోజున తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కూడా కుమారస్వామి వచ్చారు. ఇందులో కేసీఆర్ పక్కనే కూర్చోవడంతో పాటు గులాబీ కండువా కూడా కప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక డిసెంబర్ 6న ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్​ ఆఫీసు ఓపెనింగ్ కు సైతం కర్నాటక మాజీ సీఎం హాజరయ్యారు. ఈ విధంగా సీఎం కేసీఆర్​తో  క్లోజ్​గా తిరిగిన కుమారస్వామి.. బీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన తొలి రాజకీయ సభకు మాత్రం ఎందుకు అటెండ్​ కాలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

హైదరాబాద్​ కర్నాటకపై బీఆర్ఎస్​ ఆశలు గల్లంతు 

ఈ ఏడాది చివర్లో జరగనున్న కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్​ వల్లే ఈ మీటింగ్​ కు కుమార స్వామి రాలేదనే టాక్​ వినిపిస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో 92 స్థానాలకు గతేడాది డిసెంబర్ 19నే జేడీఎస్ చీఫ్ కుమారస్వామి అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని సెగ్మెంట్ల నుంచి జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. జేడీఎస్ తో కలిసి కర్నాటకలోని పలు సెగ్మెంట్లలో పోటీ చేయాలని బీఆర్ఎస్​భావించింది. కల్యాణ కర్ణాటక (హైదరాబాద్ కర్నాటక) పరిధిలోని గుల్బర్గా, రాయిచూర్, బీదర్, బళ్లారి తదితర జిల్లాల్లో తమ అభ్యర్థులను నిలిపేందుకూ బీఆర్ఎస్​సిద్ధమైంది. అయితే అందుకు విరుద్ధంగా కర్నాటకలోని అన్ని స్థానాల్లో తమ పార్టీయే (జేడీఎస్​) పోటీ చేస్తుందని  కుమారస్వామి ప్రకటించడంతో షాక్ కు గురైన గులాబీ బాస్..  కావాలనే కుమారస్వామిని పక్కన పెట్టారని తెలుస్తోంది. అందుకే ఆయనను ఖమ్మం బహిరంగ సభకు కేసీఆర్​ ఆహ్వానించలేదని సమాచారం.జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపాక సీఎం కేసీఆరే..  కుమారస్వామిని  దూరం పెట్టారనే మరో వాదన కూడా వినిపిస్తోంది.