
న్యూఢిల్లీ : కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ పీఎం హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్(సెక్యులర్) పార్టీ ఎన్డీయే కూటమిలో జాయిన్ అయింది. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగియగానే జేడీఎస్ ఎన్డీయేలో చేరినట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతాయని తెలిపారు.
జేడీఎస్ నిర్ణయం పట్ల నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎన్డీయేలోకి వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. కూటమిని, న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను జేడీఎస్ చేరిక మరింత బలపరుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్న కర్నాటకలో జేడీఎస్ మూడో బలమైన పార్టీగా ఉంది. దక్షిణ కర్నాటకలో పట్టున్న జేడీఎస్ చేరికతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనైనా బీజేపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.