Karnataka Results : సింగపూర్ కు కుమారస్వామి.. మేమే కింగ్ అంటూ జేడీఎస్ హడావిడి

Karnataka Results : సింగపూర్ కు కుమారస్వామి.. మేమే కింగ్ అంటూ జేడీఎస్ హడావిడి

మే 13వ తేదీన కర్నాటక ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఎవర్ని వరిస్తుందా...అనే ఉత్కంఠ నెలకొంది. వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా..? లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? లేదంటే సర్వే రిపోర్టులు నిజం కానున్నాయా..? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈసారి కూడా జేడీ(ఎస్ ) పార్టీ కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు చాలామంది.

ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే కాంగ్రెస్ తో పాటు బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని జేడీ(ఎస్) నాయకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం తమ పార్టీ కింగ్ మేకర్ గా ఉంటుందని ధీమాగా ఉన్నారు. 

మరోవైపు.. కర్నాటకలో ఈసారి హంగ్ ఏర్పడే చాన్స్ కూడా ఉందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ హంగ్ ఏర్పడితే నిజంగానే జేడీ(ఎస్) కింగ్ మేకర్ గా నిలిచే చాన్స్ ఉంటుంది.  

తమ అధినేత కుమారస్వామి సింగపూర్ లో ఉన్నారని, ఇప్పుడు తాము ఏ పార్టీతో జట్టు కట్టాలనే విషయంపై ఇంకా చర్చించలేదని జేడీ(ఎస్) నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటామని సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ చెప్పారు. 

జేడీ(ఎస్) నేతల వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. తాము ఇప్పటి వరకూ జేడీ(ఎస్) నాయకులను సంప్రదించలేదని చెబుతోంది. తాము స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తామని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ధీమా వ్యక్తం చేశారు. 

సింగపూర్ కు కుమారస్వామి

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి హెల్త్ చెకప్ కోసం మే 11వ తేదీన సింగపూర్ వెళ్లారు. కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారాలతో కొంత అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సింగపూర్ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వ్యక్తిగత సహాయకుడు, మరికొంతమందితో కలిసి కుమారస్వామి సింగపూర్ వెళ్లారు. శనివారం (మే 13వ తేదీ) సాయంత్రానికి కర్నాటకకు చేరుకోనున్నారు కుమారస్వామి. 224 మంది సభ్యులు ఉన్న కర్నాటక అసెంబ్లీకి మే 10వ తేదీ బుధవారం ఒక దశలోనే ఎలక్షన్స్ జరిగాయి. మే 13వ తేదీ శనివారం రోజు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.