జేడీయూ నుంచి పోటీ చేస్తే 30 ఓట్లే వచ్చినయ్ : పఠాన్

జేడీయూ నుంచి పోటీ చేస్తే 30 ఓట్లే వచ్చినయ్ : పఠాన్

అహ్మదాబాద్‌లోని బాపునగర్ స్థానం నుండి పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి పఠాన్ ఎమ్తియాజ్‌ఖాన్ సిద్ఖాన్ కు కేవలం 30 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఏ అభ్యర్థికీ రానన్ని  తక్కువ ఓట్లు కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు పోటీ చేసిన 1,621 మంది అభ్యర్థుల్లో పఠాన్‌కు వచ్చిన ఓట్లే అత్యల్పం. 

అయితే.. తన తరుపున పార్టీ ప్రచారం చేయలేదని పఠాన్ వాపోయాడు. తాను ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే తనకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవని చెప్పుకొచ్చాడు. పఠాన్ కు  ఎన్నికలేం కొత్త కాదు. గతంలోనూ గుజరాత్‌లోని ఖేడా నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ ఎన్నికలో ఆయనకు 5,000కు పైగా ఓట్లు వచ్చాయి. 

పఠాన్ 2019 ఎన్నికల తర్వాత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీలో చేరారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జేడీయూలో చేరారు. అతి తక్కువ ఓట్లు వచ్చినందుకు బాధగా ఉన్నప్పటికీ.. దీనిని ప్రజల తీర్పుగా గౌరవిస్తానన్నారు. పఠాన్ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్.